కర్ణాటకలో పతనం అంచున సంకీర్ణ ప్రభుత్వం !

లోక్‌సభ రెండోవిడత ఎన్నికలు ఉత్తర కర్ణాటకలో మరికొన్ని గంటల్లో పూర్తి కానున్న తరుణంలో సంకీర్ణ ప్రభుత్వం పతనావస్థకు చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఆగస్టులో మంత్రి పదవి కోల్పోయిన రమేశ్‌ జార్కిహొళి కాంగ్రెస్‌లో రెబల్‌గా మారి బీజేపీకి అండగా కొనసాగుతున్నారు. 

శాసనసభ, బడ్జెట్‌ సమావేశాలకు దూరంగా ఉన్న రమేశ్‌ జార్కిహొళిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య, స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ను కోరారు. ఈ వివాదం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 

ఇలా సాగుతుండగానే నాలుగురోజుల క్రితం హుబ్బళ్ళి పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను డెలిషన్‌ హోటల్‌లో రమేశ్‌జార్కిహొళి భేటీ కావడం తాజాగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గోకాక్‌తోపాటు ఇతర ప్రాంతాలలో బీజేపీకి అండగా నిలవాలనే సంకేతాలు ఇవ్వడం కొత్త మలుపునకు కారణమైంది. మంగళవారం పోలింగ్‌ ముగియగానే కొత్త రాజకీయం ప్రారంభం కానున్నదనిపిస్తోంది. రమేశ్‌ జార్కిహొళితోపాటు మరో నలుగురు రాజీనామా చేసినా సంకీర్ణ ప్రభుత్వానికి బలం తగ్గనుంది.

 ఆ వెంటనే గవర్నర్‌కు సిఫారసు చేసి సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ లేదని వివరించేందుకు బీజేపీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇలా నెలరోజులు సంకీర్ణ ప్రభుత్వానికి ఊపిరి తీసుకోకుండా ఉత్కంఠకు గురి చేసి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాక ముందడుగు వేయాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌, జేడీఎ్‌సలు అటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయమని కోరనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సంకీర్ణ ప్రభుత్వానికి బెళగావి రెబల్స్‌ నేతలనుంచి ముప్పు తప్పదని చెప్పవచ్చు.