నిర్వాసితులకు న్యాయం చేయాలి

దేశంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా బడుగు, బలహీన వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నారని అంటూ పరిహారం, పునరావాసం పూర్తయ్యాక పనులు ప్రారంభించడం మేలని బిజెపి ఎమ్మెల్సీ పి.మాధవ్‌ పేర్కొన్నారు. విశాఖపట్నం సమీపంలోని నావెల్‌ ఆల్టర్నేటివ్‌ ఆర్గనైజేషన్‌ బేస్ (ఎన్‌ఏవోబీ) నిర్మాణంతో నిర్వాసితులుగా మారిన వారికి తగిన విధంగా పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన విన్నవించారు.

దిల్లీలో మంత్రిని బాధితులతో సహా వెళ్లి కలిశారు. ‘2010లోనే ఎన్‌ఏవోబీ పనులు ప్రారంభించినా నేటికీ నిర్వాసితులకు తగిన న్యాయం జరగలేదు. 4 గ్రామాలు పూర్తిగా ఏడు ప్రభావిత గ్రామాలుగా మారుతున్నాయి. పరిహారం, పునరావాసం పూర్తయ్యాక ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. పోలవరంలోనూ అదే పద్ధతి పాటించాలని’ ఆయన సూచించారు.

 నిర్వాసిత గ్రామాలకు సంబంధించి గతంలోని ఒప్పందం ప్రకారం వెంటనే జెట్టి నిర్మించాలని, ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.  ఎన్‌ఏవోబీలో స్థానికులకు ఉద్యోగాలివ్వాలని, 2018 నాటికి మేజర్లయిన వారికి చట్టపరిహారం పరిహారం చెల్లించాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.