అసదుద్దీన్ ఒవైసీకి కోల్‌కతా కోర్టు సమన్లు

ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని కోల్‌కతా వాసి ఒకరు బంకషల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోల్‌కతా కోర్టు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153 ఎ, 295 ఏల కింద అసదుద్దీన్ ఒవైసీ సెప్టెంబరు 1వతేదీన కోర్టు ముందు హాజరు కావాలని సమన్లు పంపించింది. 
గురుగ్రామ్ నగరంలో ఇటీవల కొందరు వ్యక్తులు ముస్లిమ్ యువకుడిని మంగలిషాపునకు తీసుకువెళ్లి అతనికి బలవంతంగా గడ్డం గీయించారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ ఈ నెల 5వతేదీన హైదరాబాద్ నగరంలో జరిగిన ర్యాలీలో మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ముస్లిమ్ యువకుడి గడ్డం గొరిగించిన వ్యక్తిని ఇస్లాంలోకి మార్పించి అతనితో గడ్డం పెంచుతామని అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
ఈ వ్యాఖ్యలపై ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడంతో కోల్‌కతా కోర్టు విచారణకు స్వీకరించి అతనికి సమన్లు జారీ చేసింది.