అణ్వాయుధాలు దీపావళి కోసమా? ... మోదీ ఎద్దేవా

పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడే స్థితిలో భారత్‌ లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘అణ్వాయుధాల బటన్‌ నొక్కుతాం.. అణ్వాయుధాల బటన్‌ నొక్కుతాం’ అంటూ హెచ్చరికలు చేయడాన్ని ఆ దేశం ఆపాల్సిన సమయం ఆసన్నమైందని హితవు చెప్పారు. భారత్‌ అమ్ములపొదిలోని అణ్వాయుధాలు దీపావళి వేడుకల కోసం దాచినవి కాదనే విషయాన్ని పాక్‌ ఇప్పటికైనా గ్రహించాలని హెచ్చరించారు.

గుజరాత్‌లోని పటన్‌, రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్‌ నగరాల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మోదీ మాట్లాడుతూ పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను సురక్షితంగా అప్పగించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాను గట్టిగా హెచ్చరించినందు వల్లే పాక్‌ తోకముడిచిందని ప్రధాని వెల్లడించారు. తాను హెచ్చరించిన మరుసటిరోజే, అభినందన్ పట్టుబడిన తర్వాత రెండో రోజు మోదీ 12 మిస్సయిల్స్‌ను సిద్ధం చేశారని, బహుశా పాకిస్తాన్‌పై వాటితో దాడి చేయవచ్చునని ఒక సీనియర్ అమెరికా అధికారి తెలిపారని చెప్పారు. దీనిపై తన స్పందన కోరగా, దీని గురించి చెప్పేదేమీ లేదని, అవసరమైనప్పుడు మాత్రమే వివరాలు వెల్లడిస్తానని అమెరికా అధికారికి స్పష్టం చేశానన్నారు.

అదే రోజు సాయంత్రంకల్లా భారత పైలట్‌ను తిరిగి అప్పగించేస్తామంటూ పాక్‌ ప్రకటన చేసిందని చెప్పారు. ఒకవేళ అదే జరగకపోయి ఉంటే ఆ రోజు రాత్రి.. పాకిస్థాన్‌ పాలిట ‘కాళ రాత్రి’(ఖతల్‌ కీ రాత్‌) అయి ఉండేదని చెప్పారు. మోదీ అనే భారత ప్రధాని హయాంలో పూడ్చుకోలేనంత నష్టం జరిగిందంటూ పాకిస్థానీయులు భావితరాలకు చెప్పుకునే పరిస్థితి తలెత్తేదని వివరించారు.

ఇదంతా అమెరికా వాళ్లు చేసిన విశ్లేషణ అని.. సమయం వచ్చినప్పుడు తానే వివరాలన్నీ ప్రజల ముందుంచుతానని స్పష్టం చేశారు. ప్రధాని కుర్చీ ఉన్నా.. ఉండకపోయినా దేశ భద్రత విషయంలో వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. నేనా? ఉగ్రవాదులా? ఎవరో ఒకరే ఉండాలనే ధ్యేయంతో గత ఐదేళ్లుగా ఉగ్రవాదంపై పోరాటం సాగిస్తున్నట్లు వివరించారు. ఉగ్రవాదం అంతం కావాలని భావించే వారంతా కమలం గుర్తుకే ఓటువేయాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు.

కాగా, దేశ ప్రజలను కాంగ్రెస్ నిరంతరం మోసం చేస్తోందని మోదీ ఆరోపించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత యాబై ఏళ్ల పాటు కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసిస్తే ఆ పార్టీ మాత్రం మోసం చేసిందని తెలిపారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి ప్రజల మధ్య విబేధాలు సృష్టించిందని ఆరోపించారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి, తప్పుడు వాగ్దానాలు చేయడమే మూడు విధానాలను కాంగ్రెస్ అమలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ కారణంగా మన దేశానికి చెందాల్సిన సింధూ నది జలాలు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయని చెప్పారు. 

కాంగ్రెస్ 55 ఏళ్లలో చేయలేనిది తాము ఐదేళ్లలో చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశామని ప్రధాని పేర్కొన్నారు. అవినీతిరహిత పాలనను అందించగలిగామని చెబుతూ దేశాభివృద్ధి , ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. ప్రజల మద్దతుతో పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత, అవినీతి, నల్లధనం,  ఉగ్రవాదంతో పోరాటం చేశామని చెప్పారు. దేశాన్ని ఉగ్రవాదం నుంచి రక్షణ కల్పిస్తున్నామన్నారు. నవతరానికి అభివృద్ధి పథంలోని నూతన భారత్‌ను అందించాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని మోదీ కోరారు.