వివాదంలో రాహుల్ మానస సరోవర యాత్ర

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభంలోనే వివాదం రేగింది. ఆయన ఆగస్టు 31న బయల్దేరి, నేపాల్‌లోని ఖాట్మండు వెళ్ళారు. అక్కడ ఆయన ఓ హోటల్‌లో చికెన్ కుర్‌కురే ఆరగించినట్లు వార్తలు రావడంతో తీర్ధయాత్రకు వెళ్లి మాంసాహారం తినడం ఏమిటనే విమర్శలు చెలరేగుతున్నాయి.

రాహుల్ గాంధీ నేపాల్ సందర్శనపై చాలా మంది ఆసక్తి చూపడం సహజమే కాబట్టి మీడియా ఆ వార్తలను ప్రజలకు అందించడానికి ఉత్సాహం చూపించింది. ఖాట్మండులో ఆయన వూటూ రెస్టారెంట్‌లో రాత్రి భోజనం చేశారు.

ఆ రెస్టారెంట్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ జీన్స్, టీ-షర్ట్ ధరించారని చెప్పారు. ఆయన నెవారీ ప్లాటర్ ఆర్డర్ చేశారని చెప్పారు. ముఖ్యంగా చికెన్ కుర్‌కురేను ఇష్టంగా తిన్నారని, రెండోసారి అడిగి మరీ తిన్నారని చెప్పారు. ఈ విషయాన్నీ స్థానికంగా ఒక పత్రిక ప్రచురించడంతో వివాదం ఆవరించింది.

దీనిపై బీజేపీ మీడియా సెల్ ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ ఘాటుగా స్పందించారు. ఆయన ఓ ట్వీట్‌లో ‘‘రాహుల్ గాంధీ కైలాస మానస సరోవర్ యాత్రలో మాంసాహారం తిన్నారని రెస్టారెంట్ వెయిటర్ చెప్పారు. హిందువుల మనోభావాలను నిరంతరం దెబ్బతీయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది’’ అని విమర్శించారు.

అమిత్ మాలవీయ ఆయన విమర్శలకు మద్దతుగా ఓ హిందీ వార్తా చానల్ ప్రసారం చేసిన వీడియోను కూడా జత చేశారు.  ఈ నేపథ్యంలో వూటూ రెస్టారెంట్ ఫేస్‌బుక్ పోస్ట్‌ ద్వారా స్పందిస్తు రాహుల్ గాంధీ శాకాహారమే ఆర్డర్ ఇచ్చారని తెలిపింది.