తెలంగాణలో కాంగ్రెస్ ఖాళి.... రెండొంతులకు పైగా ఎమ్యెల్యేల జంప్ !

గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారమలోకి వస్తామని ధీమాతో ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పార్టీ అస్తిత్వం పట్ల ఖంగారు పడుతున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ పరిస్థితి ఏమో గాని తెలంగాణలో మాత్రం కొట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలలో 19 మంది గెలుపొందితే ఇప్పటికే పది మంది పార్టీ ఫిరాయించారు. మరో ముగ్గురు ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక్కరి కోసం అధికార పక్షం గాలం వేసింది. దానితో నలుగురు, ఐదుగురికి పరిమితం కానున్నది. వారిలో అయినా మరెంతమంది మిగులుతారో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. 

 ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సంగారెడ్డి జగ్గారెడ్డిలు పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో రహస్యంగా భేటీ అయినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని అటు టిఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు కూడా దృవీకరిస్తుండటం విశేషం. 

సీఎం కేసీఆర్‌తో వారికి డీల్‌ కుదిరిందని, కారెక్కడమే తరువాయి భాగమేనని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. వీరితో పాటు మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి సైతం పార్టీని వీడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీని వీడేది లేదని చెబుతున్నా...చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని బలహీన పరచాలంటే రోహిత్‌రెడ్డి అవసరమని భావిస్తున్న టిఆర్‌ఎస్‌ పార్టీ...అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రోహిత్‌ రెడ్డి కారెక్కటం ఖాయమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

ఇదిలావుంటే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గులాబీ గూటికి చేరనుండటంతో కాంగ్రెస్‌ సంఖ్య ఆరుకు పడిపోయింది. దీంతో ప్రతిపక్షహోదా కాంగ్రెస్‌ పార్టీకి కలగానే మిగలనుంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, హరిప్రియనాయక్‌, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, సురేందర్‌, చిరుమర్తి లింగయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, హర్షవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌కు జై కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. 

భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య పార్టీ మారేందుకు మొదటి వరసలోనే ఉన్నా...మావోయిస్టులు బెదిరించడం వల్లే కొన్నాళ్లూ ఆగినట్టు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. వరంగల్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య గండ్ర జ్యోతి ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కొనసాగుతున్నారు. ఆమెకు కీలకమైన జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇస్తామని అధికార పార్టీ నుంచి సంకేతాలిచ్చినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎప్పుడు సీఎం కేసీఆర్‌పై ఒంటికాలిమీద లేచే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవలకాలంలో మెత్తబడ్డారు. ప్రతి విషయంలోనూ సీఎంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.   ]