లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

 ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఒంటి గుర్రపు పందెం జరుగుతోందని, బీజేపీ ప్రభంజనం వీస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

శనివారం జైట్లీ రాసిన బ్లాగ్‌లో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎన్నిక కోసం జాతీయ నాయకత్వ పోటీ దాదాపు ఒంటి గుర్రపు పందెంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాదిరిగా సమర్థులు, ఆమోదం పొందినవారు మరొకరు లేరు’’ అని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రచారం ఘనంగా జరుగుతోందని, అదే సమయంలో కాంగ్రెస్ ప్రచారం బూటకపు అంశాలను ప్రస్తావిస్తూ అపహాస్యమవుతోందని పేర్కొన్నారు. 

బీజేపీ/ఎన్డీయే ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోందని, ఎజెండాను సృష్టించిందని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంపై స్పష్టత ఉందని చెప్పారు. ఆయనకు అనుకూలంగా బలమైన మద్దతు కనిపిస్తోందన్నారు. గత ఐదేళ్ళలో సాధించిన ప్రధాన విజయాలపై బీజేపీ/ఎన్డీయే ప్రచారం దృష్టి పెట్టిందన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను, పేదలను బలోపేతం చేయడం, స్వచ్ఛ ప్రభుత్వం, దేశ భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం వంటివాటిపై ప్రచారం జరుగుతోందని తెలిపారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో ఓటర్లలో స్పందన తేలేకపోతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉన్న చోట్ల బీజేపీ సుస్థిర స్థానంలో ఉందని చెబుతూ ఓ ఏడాది నుంచి కాంగ్రెస్ బూటకపు అంశాల ఆధారంగా మాట్లాడుతోందని, ఈ ప్రచారం కుప్పకూలిందని దుయ్యబట్టారు. ఇప్పుడు కొత్త స్కీమ్ గురించి మాట్లాడుతున్నారని, అయినా ప్రజలు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. (కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న కనీస ఆదాయ పథకాన్ని జైట్లీ ప్రస్తావించారు). 

కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ అగ్ర (గాంధీ) కుటుంబ సభ్యులపై ఆధారపడి ప్రచారం చేయాలనుకున్నారని, అది విజయవంతం కాలేదని పేర్కొన్నారు. నిస్సందేహంగా ఈ తరపు వారసుడు (రాహుల్ గాంధీ) కాంగ్రెస్ పార్టీకి భారంగా మారారని స్పష్టం చేశారు.