హుస్నాబాద్ లో 7న ప్రజల ఆశీర్వాద సభ

ముందస్తు ఎన్నికల కసరత్తులో భాగంగా హైదరాబాద్ శివారులో `ప్రగతి నివేదన’ సభ జరిపిన ఇదు రోజులకే, ఈ నెల 7న మరో బహిరంగ సభకు ముఖ్యమంత్రి కే చంద్రసేఖరరావు కసరత్తు చేస్తున్నారు. ఆ ముందు రోజుననే అసెంబ్లీ రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసుందని సంకేతం వెలువడడంతో ఈ బహిరంగ సభ ఎన్నికల శంఖారావం మోగించడం కోసంగా భావిస్తున్నారు. `ప్రగతి నివేదన’ అంతా ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కే టి రామారావు సారధ్యంలో జరిగితే, ఇప్పుడు హుస్నాబాద్ లో జరుగనున్న బహిరంగ సభ అంతా ముఖ్యమంత్రి మేనల్లుడు, మంత్రి టి హరీష్ రావు సారధ్యంలో జరుగాబోవడం విశేషం.

ఈ బహిరంగ సభ ఏర్పాట్లు గురించి ముఖ్యమంత్రి స్వయంగా హరీష్ రావుతో పాటు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తో సమాలోచనలు జరిపారు. వెంటనే హరీష్ రావు కార్యరంగంలోకి దిగి పార్టీ నాయకులతో కలసి బహిరంగసభ ఏర్పాట్లు, సభాస్థలిని పరిశీలించారు. ఈ సభకు `ప్రజల ఆశీర్వాద’ సభ అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. రాబోయే 50 రోజులలో ముఖ్యమంత్రి వంద బహిరంగ సభలు జరుపుతున్నట్లు చెప్పారు. అంటే ఎన్నికల షెడ్యుల్ ప్రకటించే లోగానే వంద నియోజక వర్గాలలో ఎన్నికల ప్రచార సభలను పూర్తి చేసే కార్యక్రమం రూపొందించారు.

నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడమే ఈ సభల ఉద్దేశ్యమని చెబుతున్నా ఎన్నికల ప్రచారంగానే భావించా వలసి ఉంటుంది. ఈ నెల 7 శ్రావణమాసంలోని చివరి శుక్రవారం కావడంతో, ఆ రోజు మంచి రోజని పండితుల సూచనపై ముఖ్యమంత్రి ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది.  రాష్ట్ర్రంలోని ఈశాన్య ప్రాంతమైన హుస్నాబాద్ ను తొలి సభకు ఎంపిక చేశారు. ఆర్టీసీ బస్సు డిపో పక్కన మైదానాన్ని బహిరంగసభ కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.