హిందువులపై కాంగ్రెస్ వేసిన ఉగ్రవాద మచ్చకు సమాధానం ప్ర‌జ్ఞా!

భోపాల్ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా సాధ్వి ప్ర‌జ్ఞా సింగ్ థాకూర్‌ను నిల‌బెట్ట‌డాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గట్టిగా స‌మ‌ర్థించారు. ఏటీఎస్ అధికారి హేమంత్ క‌ర్క‌రే త‌న శాపం వ‌ల్లే ఉగ్ర‌వాదుల చేతుల్లో మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌జ్ఞా పేర్కొనడం పట్ల ఒక వంక దేశ‌వ్యాప్తంగా దుమారం రేపగా, మరోవంక ప్ర‌ధాని మోదీ మాత్రం .. ప్ర‌జ్ఞాకు ఫుల్‌మార్క్స్ వేశారు.

హిందూ నాగ‌రిక‌త‌పై ఉగ్ర‌వాదం మ‌చ్చ వేసిన కాంగ్రెస్ నేత‌ల‌కు ప్ర‌జ్ఞానే ఈ ఎన్నికలలో స‌మాధానంగా నిలుస్తుంద‌ని మోదీ స్ఫష్టం చేశారు. త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో హిందూ సంస్కృతిని కాంగ్రెస్ నేత‌లు కించ‌ప‌రిచార‌ని మోదీ ధ్వజమెత్తారు. ప్ర‌జ్ఞా ఓ మ‌హిళ అని, అది కూడా ఆమె సాధ్వి అని, అలాంటి వ్య‌క్తిని చాలా హేయంగా అవ‌మానించార‌ని మోదీ మండిపడ్డారు.

బెయిల్‌పై ఉన్న ప్ర‌జ్ఞా ఎన్నికలలో పోటీ చేయడాన్ని మోదీ స‌మ‌ర్థిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా బెయిల్‌పైనే ఉన్నార‌ని, మ‌రి వారిని ఎందుకు పోటీకి దూరంగా ఉంచ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

 కాంగ్రెస్ పార్టీ కొన్ని ల‌క్ష్యాల‌తో త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ద‌ని, సంజౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు, జ‌డ్జి బీహెచ్ లోయా మృతి లాంటి కేసుల‌ను బీజేపీకి అంట‌గ‌ట్టింద‌ని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజౌత ఎక్స్‌ప్రెస్ కేసులో హిందూ ఉగ్ర‌వాదం అంటూ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, కాంగ్రెస్ వాళ్లు 5వేల ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన మ‌న నాగ‌రిక‌త‌ను అవ‌మానించార‌ని మోదీ దుయ్యబట్టారు.

ప్ర‌ధాని ఇందిరా గాంధీ హ‌త్య అనంత‌రం చోటుచేసుకున్న సిక్కుల ఊచ‌కోత ఉగ్ర‌వాదం కాదా అని మోదీ ప్ర‌శ్నించారు. ఓ పెద్ద చెట్టు కూలితే భూమి కంపిస్తుంద‌ని రాజీవ్ గాంధీ అన్నార‌ని, ఆ త‌ర్వాత ఢిల్లీలో వేల మంది సిక్కుల‌ను హ‌త‌మార్చార‌ని, మ‌రి అది ఉగ్ర‌వాదం కాదా అని మోదీ నిలదీశారు. రాజీవ్ ప్ర‌ధాని అయిన త‌ర్వాత ఏ మీడియా కూడా ఈ విష‌యాన్ని ప్ర‌శ్నించ‌లేద‌ని గుర్తు చేశారు.