జవాన్లకు స్మార్ట్ ఫోన్లిస్తే మేలు

సైనికులకు స్మార్ట్ ఫోన్ల వినియోగించడానికి అనుమతి ఇస్తే బాగుంటుందని, సామాజికమాధ్యమాలను మానసిక యుద్ధతంత్రం ద్వారా ప్రచ్ఛన్న యుద్ధాన్ని, చొరబాటుదాలు, టెర్రరిజంపై రాజీలేని పోరు చేసేందుకు వీలవుతుందని సైనిక దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సూచించారు. అన్ని స్థాయిలో సామాజిక మాధ్యమాలతో అనుసంధానం అవసరమని ఆయన చెప్పారు. సైనికుల సంక్షేమం కోసం యాప్‌ను రూపొందించామని తెలిపారు. స్మార్ట్ఫోన్ల వినియోగానికి అనుమతి లేకుండా ఈ తరహా ఫీచర్లను సేవలను ఎలా పొందగలరని ప్రశ్నిచ్న్హారు.

టెక్నాలజీతో పాటే ఆర్మీ జవాన్లు కూడా పోటీతత్వంతో పనిచేసే పరిస్థితులను కల్పించాలని సూచించారు. ఆర్మీ జవానులు, స్మార్ట్ఫోన్లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా మానసికయుద్ధతంత్రం విధానాలను, ఎత్తుగడలను అమలు చేయవచ్చని పేర్కొన్నారు. ఉగ్రవాదులు, చొరబాటుదారులను తరిమిగొట్టేందుకు ఆర్మీ జవాన్లు నిరుపమానమైన సేవలుఅందిస్తున్నారని కొనియాడారు.  ఆర్మీతో పాటు అన్ని విభాగాలకు సామాజిక మాధ్యమం నిజజీవితంలో, విధుల్లో భాగమయ్యాయని గుర్తు చేసారు.

ఆర్మీ జవాన్లు నిర్వహిస్తున్న సున్నితమైన విధుల నిర్వహణ వల్ల వారికి స్మార్ట్ఫోన్ల వినియోగానికి అనుమతి లేదని చెప్పారు. వీటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్మీ జవాన్ల కోసం ఆర్పాన్ అనే మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని ద్వారా ఆర్మీ జవాన్ల కుటుంబ సభ్యులు సమస్యలు తెలియచేసేందుకు వీలవుతుందన్నారు. మన జవాన్ల సంక్షేమానికి సొంతంగా యాప్స్‌ను రూపొందిస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్ల ఉపయోగించరాదని ఎలా చెప్పగలమని ప్రశ్నిచారు.

కాగా, సైన్యంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని బిపిన్ రావత్ హెచ్చరించారు. మేజర్ లీటుల్ గొగోయ్ ఓ స్థానిక యువతిని శ్రీనగర్‌లోని ఓ హోటల్‌కు రప్పించుకున్న వ్యవహారంపై సైనికన్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. ఇది ప్రజల దృష్టిలో సైన్యం ప్రతిష్ఠను దిగజార్చే చర్యగా భావిస్తున్నారు.

నేరాన్ని బట్టి మేజర్ గొగోయ్‌పై చర్య తీసుకుంటామని జనరల్ రావత్ నొక్కిచెప్పారు. “అనైతిక చర్యలను, అవినీతిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేస్తున్నాను. సైనిక న్యాయస్థానం మేజర్ గొగోయ్‌ని దోషిగా తేల్చింది. ఆయనను కోర్ట్‌మార్షల్ చేయాలని సిఫారసు చేసింది. ఇది అనైతికమే అయితే దాని ప్రకారం చర్య తీసుకుంటాం. మరోటి అయితే ఆ ప్రకారమే శిక్ష ఉంటుంది” అని తెలిపారు.

అమ్మాయిని హోటల్‌కు పిలిపించుకున్న సమయంలో మేజర్ గొగోయ్ తన డ్యూటీ ప్రదేశానికి దూరంగా ఉన్నారని కూడా సైనిక న్యాయస్థానం తేల్చింది. ఇది మరింత తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. మేజర్ గొగోయ్ గతఏడాది ఓ కశ్మీరీ యువకుని తన జీపు బానెట్‌కు కట్టేసి అల్లర్లు జరిగే ప్రాంతాల్లో తిరగడం తీవ్ర విమర్శలకు గురైంది.

రాళ్లురువ్వే వారిని అదుపు చేసేందుకు అలా తిప్పినట్టు ఆయన తర్వాత ప్రకటించారు. అప్పట్లో తీవ్రవాద వ్యతిరేక చర్యలు నిరంతరంగా చేపట్టినందుకు జనరల్ రావత్ ఆయనకు ఆర్మీచీఫ్ కమెండేషన్ కార్డు బహూకరించారు. ఏడాది తిరిగేలోపు మేజర్ గొగోయ్ అనైతిక ప్రవర్తన కారణంగా తలదించుకోవాల్సి వచ్చింది.