చంద్రబాబు - జగన్ ఎవ్వరు సీఎం ఐనా హామీలు భారమే !

ఎన్నికల ముందు టిడిపి, వైసిపి పోటీ పది ఇబ్బడిముబ్బడిగా ఇచ్చిన హామీలు మే చివరిలోగా ఎవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో చంద్రబాబు నాయుడు, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లలో ఒకరు ముఖ్యమంత్రి కావలసిందే.వారిద్దరిలో ఎవ్వరు అధికారంలోకి వచ్చినా ఉద్యోగుల జీత భత్యాలకే వెదుక్కోవలసినంత దారుణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నెలకొంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏమి చేస్తారో గాని ముందు ప్రభుత్వం నడవాలి అంటే అదనపు ఆర్ధిక వనరులను సమీకరించుకొనక తప్పదు. అందుకోసం ప్రజలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారం మోపక తప్పదని ఆర్ధిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ  దిశలో ఆర్థికశాఖ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు కూడా తయారు చేసినట్టు తెలిసింది.

అత్యవసరంగా పరిస్థితిని మెరుగుపరచకపోతే... మరో నాలుగైదు నెలల తరువాత జీతాల చెల్లింపులకూ సమస్యలు ఏర్పడనున్నాయి. వివిధ ఆదాయ వనరుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ప్రస్తుతం నెలకు నాలుగు వేల కోట్లకు పైగా ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణంగా ప్రతి నెలా 12 నుంచి 14 వేల కోట్లు ఖజానాకు వివిధ రూపాల్లో ఆదాయం సమకూరుతుంది. 

జీతాలకు పోను ఎనిమిది, తొమ్మిది వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. వీటితో వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంది. కొద్దికాలం వరకు ఈ పరిస్థితి ఉండేది. అయితే, ఎన్నికల ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా అమలులో తీసకువచ్చిన అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ వంటి పథకాలు ఖజానాకు మరింతగా మారాయి. వివిధ వనరుల నుండి వచ్చే ఆదాయం చాలకపోవడంతో అప్పుకూడా చేయాల్సివచ్చింది.

 ఆర్థికసంవత్సరం మొదటి నెలలోనే భారీ మొత్తంలో అప్పు తీసుకుని, మళీ చేయిచాచిన తీరు పట్ల ఆర్‌బిఐ అభ్యంతరం వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాలుగైదు వేల కోట్లు మొత్తాన్ని అప్పుగా సమీకరించగలిగిన ఏప్రిల్‌ నెలలోనే నిధుల కోసం కష్టపడాల్సివస్తే భవిష్యత్‌ ఏమిటన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి, వైసిపిలు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సివస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. 

ఆదాయం పెంచుకోకపోతే జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని, పథకాల అమలు కూడా అంతంతమాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఆర్ధికశాఖ అంతర్గత సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది. సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు అక్టోబర్‌, నవంబర్‌ నాటికి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం, అదనపు అప్పు తీసుకురావడానికి నిబంధనలు అంగీకరించకపోవడం కూడా అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.