అర్ధాంతరంగా సెలవుపై ఆర్ధిక కార్యదర్శి రవిచంద్ర!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేకపోయినా, ఎన్నికల కమీషన్ ఆదేశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన ఎల్వి సుబ్రహ్మణ్యం మొత్తం పరిపాలనపై పట్టు సంపాదిస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగిన లొసుగులను వెలికి తీస్తున్నారు. ముఖ్యంగా ఇష్టారాజ్యంగా సాగిన ఆర్ధిక వ్యవహారాలపై ఆరా దీస్తున్నారు. ఒక పద్ధతి అంటూ లేకుండా జరిగిన వ్యవహారాలపై విస్మయం వ్యక్తం చేయడమే కాకుండా  ఆర్ధిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి మ‌ద్దాడ ర‌విచంద్ర‌ను ఊహించ‌ని విధంగా బ‌ల‌వంతంగా సెల‌వుపై పంపారు.

దానితో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనూహ్యమైన షాక్ తగిలింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న ఉన్నతాధికారులతో ఆయన ఒక్కరు.ఈ నెల 22 నుంచి వ‌చ్చే నెల 17 వ‌ర‌కూ దీర్ఘకాలం సెలవుపై వెళ్లారు. దానితో  ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. 

ఆర్ధిక శాఖ కార్య‌ద‌ర్శిగా మ‌ద్దాడ ర‌విచంద్ర నియ‌మితుడైన నాటి నుంచి జ‌రిగిన ఆర్ధిక లావాదేవీల‌ను రాష్ట్ర ఎల్ వి సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరా తీయడంతో అనేక లొసుగులు బైటపడిన్నట్లు తెలుస్తున్నది. గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబునాయుడు జైకా, ప్ర‌పంచ బ్యాంకు, హ‌డ్కోలాంటి సంస్థ‌ల నుంచి రూ 3.5 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు రుణాలు తీసుకువ‌చ్చారు. కేంద్ర ప్ర‌భుత్వ హామీతో ఈ నిధుల‌ను రాష్ట్రానికి తెప్పించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న నిధుల‌ను స‌క్ర‌మంగా ఉద్దేశించిన కార్య‌క్ర‌మాల‌కు కాకుండా భారీ ఎత్తున మ‌ళ్లింపులు చేసింది.

ఆ అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలకమైన ఫైళ్లు అన్నింటిని ప్రధాన కార్యదర్శి తన స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. వీటిపై ర‌విచంద్ర‌ను పిలిపించి వివ‌ర‌ణ కోర‌డంతో ఆయ‌న  బెంబేలెత్తిన‌ట్లు చెబుతున్నారు. హ‌డ్కో నుంచి ఇళ్లు క‌ట్ట‌డానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకుని ఆ నిధుల‌ను త‌మ‌కు కావాల్సిన కాంట్రాక్ట‌ర్ల‌కు నిబంధనలను ధిక్కరించి మ‌ళ్లించారు.

ఈ సందర్భంగా  ఆర్ధిక శాఖ ఇచ్చిన జీవోలు అన్నీ త‌ప్పుల త‌డ‌క‌లుగా ఉన్న‌ట్లు  గుర్తించారు. అడ్డగోలుగా జరిగిన చెల్లింపుల గురించి లోతైన దర్యాప్తుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.