కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది షాక్... శివసేనలో చేరిక

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్‌కు రాజీనామా చేసి శివసేనలో చేరారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె గురువారం రాత్రి  రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

‘‘పార్టీలో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల పార్టీ సమావేశంలో నాతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులకు కనీస శిక్ష పడకపోవడం నన్ను తీవ్రంగా బాధించింది’’ ఆమె ట్విటర్‌ ద్వారా బుధవారం తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె పార్టీని వీడనున్నారని వార్తలు వచ్చాయి. ఊహించినట్లుగానే ఆమె తాజా నిర్ణయం వెలువడింది.

ఈ మేరకు ఆమె తన ట్విటర్‌ ప్రొఫైల్‌లో ‘ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి’ అనే హోదాను కూడా తొలగించేశారు. అనంతరం శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే సమక్షంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితం మధురలో ప్రియాంక చతుర్వేది రఫేల్‌ ఒప్పందం గురించి మీడియాతో మాట్లాడిన సమయంలో ఆమె పట్ల కొందరు స్థానిక కాంగ్రెస్‌ నేతలు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ వారిని వెంటనే సస్పెండ్‌ చేసింది.

అయితే జ్యోతిరాదిత్య సింథియా జోక్యంతో వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేసినట్లు ప్రకటించారు. దీనిపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. అభ్యంతరకరంగా మాట్లాడి, తనను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పార్టీ కోసం శ్రమించే వారికి బదులు గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు.