కాంగ్రెస్‌ నుండి వైదొలిగిన ప్రియాంక చతుర్వేది

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏఐసీసీ మీడియా సెల్ కన్వీనర్  ప్రియాంక చతుర్వేది పార్టీకి భారీ ఝలక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ  సొంతపార్టీపైనే ఫైర్‌ అయిన  ఆమె ఊహించినట్టుగా గత రాత్రి  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు గాలి బ్యాచ్కు ప్రోత్సాహం ఇస్తోందంటూ చతుర్వేది వ్యాఖ్యానించడం కలకలం రేపింది. 

ఈ నేపథ‍్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.   అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. మరోవైపు తన ట్విటర్‌లో కాంగ్రెస్‌  అధికార ప్రతినిధి ట్యాగ్‌ను తీసివేయడం గమనార్హం. 

కొద్ది కాలం క్రితం మధురలో మీడియా సమావేశంలో కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు  తనపై అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ  ప్రియాంక చతుర్వేది పార్టీ నాయకత్వానికి పిర్యాదు చేశారు. అపంతనం పార్టీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. కానీ తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సిధియా వారిపై సస్పెన్సన్ ఎత్తివేసినట్లు ప్రకటించడం వివాదానికి దారి తీసింది.

 దీనిపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. అభ్యంతరకరంగా మాట్లాడి, తనను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోందంటూ  ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.