‘చౌకీదార్‌ చోర్‌ హై’ పై నిషేధం

‘చౌకీ దార్‌ చోర్‌ హై’ అంటూ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ విడుదల చేసిన ప్రచార వీడియోపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాసింది. తక్షణమే ఈ ప్రచార వీడియోను నిలిపి వేయాల్సిందిగా ఆదేశించింది. 

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్‌ అదనపు ఎన్నికల అధికారి అన్ని జిల్లాల అధికారులకు సమాచారమిచ్చారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ కాంగ్రెస్‌ పార్టీపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీఎల్‌ కాంతారావు వెల్లడించారు.

‘నేను దేశానికి చౌకీదార్‌’ అంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటలను వక్రీకరిస్తూ.. ఆయనను వ్యక్తిగతంగా విమర్శించేందుకే కాంగ్రెస్‌ ఈ వీడియోను రూపొందించిందని అధికార బిజెపి ఆరోపించింది. అయితే , ఆ వీడియోలో ఎవ్వరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని కాంగ్రెస్‌ వాదిస్తోంది. 

తాజా ఎన్నికల్లో చాలా మంది రాజకీయ నాయకులు తమ ప్రచార కార్యక్రమాల్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగింది. ప్రచార కార్యక్రమాలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని ఆదేశించింది.