పరిషత్ ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం జరపండి!

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకుండానే మండల, జిల్లాప్రజా పరిషత్ ఎన్నికలకు రాష్ట్రప్రభుత్వం తొందరపడడం ఎందుకని బీజేపీ సీనియర్ నేత జీ. కిషన్ రెడ్డి ప్రశ్నించారు.పరిషత్ ఎన్నికలపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత ఆదరాబాదరాగా ఎందుకు నిర్వహిస్తున్నారో సీఎం కేసీఆర్‌ చెప్పాలని నిలదీశారు. ఈ విషయంలో  టీఆర్‌ఎస్‌ సర్కారుతో పాటు ఎన్నికల సంఘం కూడా ఇతర పార్టీలను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ ఎన్నికలను నిర్వహించే విషయమై పునరాలోచించాలని ఆయన కోరారు. ఇంత తొందరగా పరిషత్ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిజంగా ఈ ఎన్నికలు ఇంత హడావుడిగా ఈ సమయంలో నిర్వహించడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు. ఒక్కో జిల్లా పరిషత్ పరిధిలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా లేరన్నారు. స్థానిక సంస్థలు బలంగా ఉండాలని తమ పార్టీ అభిమతమని, కాని తగిన సమయం కాదని తమ అభిప్రాయమని తెలిపారు. ఈ ఎన్నికలను వాయిదా వేయడం మంచిదని ఆయన సూచించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఆరోవేలు లాంటివని చెబుతూ ఈ ఎన్నికలు నేరుగా జరపకుండా పరోక్ష పద్ధతిలో నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లని ధ్వజమెత్తారు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల కొనుగోళ్లను అడ్డుకోవడానికి కూడా ఈ విధానం దోహద పడుతుందని పేర్కొన్నారు.