జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదుల వద్ద చైనా గ్రెనెడ్లు !

జమ్మూ కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు వినియోగించిన గ్రెనెడ్లు పాకిస్థాన్ చైనా నుంచి తీసుకువచ్చి సరఫరా చేసినవని భద్రతా బలగాలు కేంద్రానికి సమర్పించిన రహస్య నివేదికలో వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల నుంచి గత ఏడాది నుంచి ఇప్పటివరకు 70 ఘటనల్లో స్వాధీనం చేసుకున్న గ్రెనెడ్లను పరిశీలించగా అవి చైనాలో తయారు చేసినవని తేలింది. చైనా గ్రెనెడ్లను పాకిస్థాన్ ఉగ్రవాదులకు అందజేసిందని కేంద్ర భద్రతా బలగాలు తన నివేదికలో వెల్లడించాయి.

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని ఉగ్రవాదుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పిస్టళ్లు, తుపాకులు, షెల్స్ చైనా దేశంలో తయారైనవనీ తేల్చారు. ఉగ్రదాడుల్లో ఉగ్రవాదులు వినియోగించిన గ్రెనెడ్లు చైనా నుంచి వచ్చాయని వెల్లడైంది. జమ్మూలోని అంతర్ రాష్ట్ర బస్టాండులో మార్చి 7వతేదీన జరిగిన గ్రెనెడ్ల దాడిలో ఇద్దరు మరణించగా మరో 32 మంది గాయపడ్డారు. ఈ దాడిలో వాడిన గ్రెనెడ్లు చైనా, పాకిస్థాన్ దేశాల్లో తయారైనవని భద్రతా బలగాల పరిశీలనలో వెలుగుచూసింది.

పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన గ్రెనెడ్లు ఉగ్రవాదుల వద్ద లభించాయి. ఉగ్రదాడుల్లో పాక్ హస్తం ఉందని అంతర్జాతీయ తెలియడంతో చైనా దేశం నుంచి గ్రెనెడ్లను తెప్పించి వాటిని ఉగ్రవాదులకు పాక్ పంపిణీ చేస్తుందని భారత భద్రత బలగాలు కేంద్రానికి సమర్పించిన నివేదికలో తెలిపాయి. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, అల్ బద్ర్, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదుల వద్ద చైనా గ్రెనెడ్లు లభించడం విశేషం. జమ్మూ సరిహద్దుల్లో చైనా గ్రెనెడ్లు లభించాయని దీన్ని బట్టి చూస్తే ఉగ్ర దాడుల వెనుక పాకిస్థాన్ తో పాటు చైనా దేశం హస్తం ఉందని భద్రతాబలగాలకు చెందిన ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు.