బిజెపి ఉన్నంతవరకు కశ్మీర్‌ను వేరుచేయలేరు

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని.. బిజెపి అధికారంలో ఉన్నా, లేకపోయినా కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడదీయడం అసాధ్యం అని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయగఢ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన  ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అలా వచ్చిన వెంటనే చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తామని వెల్లడించారు. 

‘సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కశ్మీర్‌లో మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్‌లో కూడా ఒక ప్రధాని ఉండాలని కాంగ్రెస్‌ మిత్రపక్షం అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఒమర్‌ అబ్దుల్లా వాదిస్తున్నారు. ఒక దేశానికి ఇద్దరు ప్రధానులు ఉండడం సాధ్యమేనా?'  అని ప్రశ్నించారు. 

ఈ విధంగా అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాహుల్‌ బాబాపై ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. కానీ ఆయన ఏమాత్రం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి ఎవరూ వేరుచేయలేరని పేర్కొంటూ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరని అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ వస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామంటూ బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి కాంగ్రెస్‌, నేషనల్‌ కార్ఫరెన్స్‌ పార్టీలు సహకరించడం లేదుంటూ షా ఆరోపించారు. ఇదే కాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలోకి వేల సంఖ్యలో వస్తున్న చొరబాటుదారులను నియంత్రించేందుకై రూపొందించిన నేషనల్‌ రిజిస్టర్‌ ఫర్‌ సిటిజెన్‌ను అమలు చేస్తామని షా హామీ ఇచ్చారు. 

 ఇది అమల్లోకి వస్తే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి, గుజరాత్‌ నుంచి అసోం వరకు ఉన్నటువంటి చొరబాటుదారులను దేశం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. అలా చేయని పక్షంలో వారు దేశ భద్రతకు విఘాతంగా మారే అవకాశాలున్నాయని చెప్పారు. 

కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన చేసిన ఎయిర్‌ స్ట్రైక్‌ విషయంలో కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు సంతోషంగా లేవని షా ధ్వజమెత్తారు. ఆ సమయంలో దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తే రాహుల్‌ కార్యాలయంలో మాత్రం ఆ సంతోషం లేదని దుయ్యబట్టారు. 

 దేశంలో ఏదైనా ఉగ్రదాడి జరిగితే మౌనంగా కూర్చోవడానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాదిరిగా ప్రధాని మోదీ ‘మౌనీ బాబా’ కాదని షా ఎద్దేవా చేశారు. 55 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పేద, మధ్యతరగతి, ఆదివాసీలు, దళితుల కోసం ఏమీ చేయలేదని మండిపడ్డారు. కానీ అధికారం చేపట్టిన ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం 50 కోట్ల మంది పేదవారి అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పుకొచ్చారు.