మమత బయోపిక్‌ను ఆపేయండి... బిజేపీ ఫిర్యాదు

దేశవ్యాప్త  సార్వత్రిక ఎన్నికల నడుమ 'బయోపిక్'ల వార్ కొనసాగుతూనే ఉంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ జీవితం, సాగించిన పోరాటం స్ఫూర్తిగా రూపొందుతున్న 'బాఘినీ' చిత్రం తాజాగా విడుదలకు సిద్ధమవుతుండంతో ఎన్నికల కమిషన్‌ను బీజేపీ ఆశ్రయించింది. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాల్సిందిగా ఈసీకి  రాసిన లేఖలో కోరింది.

ప్రధాని మోదీ బయోపిక్ విషయంలో వ్యవహరించినట్టే 'బాఘినీ' బయోపిక్ విడుదలకు ముందు తప్పనిసరిగా సమీక్షించాలని ఈసీకి రాసిన లేఖలో బీజేపీ పశ్చిమబెంగాల్ యూనిట్ ఉపాధ్యక్షుడు జాయ్ ప్రకాష్ మజుందార్ కోరారు.

షెడ్యూల్ ప్రకారం 'బాఘినీ' బెంగాలీ చిత్రం మే 3న విడుదల కావాల్సి ఉంది.  మమతా బెనర్జీ జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు ఈ చిత్రానికి స్ఫూర్తి అని చిత్ర యూనిట్ ప్రకటించింది. '2016లోనే సినిమా షూటింగ్ ప్రారంభించాం. అయితే ఎడిట్లు, గ్రాఫిక్ వర్క్‌కు చాలా సమయం తీసుకుంది. దీంతో విడుదలో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు మే 3న సినిమాను విడుదల చేస్తున్నాం' అని ఆ చిత్ర రచయిత, నిర్మాత పింకీ పాల్ ప్రకటించారు. 

 కాగా, ఎన్నికల మధ్యలో మమత బయోపిక్ విడుదల తేదీని నిర్మాతలు ఎంచుకోవడం టీఎంసీ ప్రత్యర్థుల్లో అనుమానాలకు తావిచ్చింది.