రాష్ట్రపతిపై సీఎం వ్యాఖ్యలు...క్షమాపణకై బీజేపీ డిమాండ్ బీజేపీ డిమాండ్

రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్‌ గెహ్లాట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సామాజిక వర్గం గురించి గెహ్లాగ్ ప్రస్తావించడాన్ని తప్పుబట్టింది. ఆయనపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.

బీజేపీ అధికార ప్రతినిథి జీ వీ ఎల్ నరసింహా రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా స్వయంగా తానే ఓ రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్న అశోక్ గెహ్లాట్ కులతత్త్వంతో కూడిన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన పదవిలో ఉన్న గెహ్లాట్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యతిరేకంగా కులతత్త్వంతో కూడిన వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు చెప్పారు. 

గెహ్లాట్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఆలోచనా ధోరణి దళిత వ్యతిరేకమని స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతికి వ్యతిరేకంగా గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలను స్వీయ విచారణకు చేపట్టి, గెహ్లాట్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నట్లు చెప్పారు. గెహ్లాట్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.

అశోక్ గెహ్లాట్ బుధవారం మాట్లాడుతూ 2017లో గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేందుకే దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా నిలిపారని ఆరోపించారు. కులాలను ఆకట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

కాగా, రాష్ట్రపతిపై తాను చేసిన వాఖ్యలను ఓ వర్గం మీడియా వక్రీకరించిందని గెహ్లాట్ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రపతి పట్ల తనకు గౌరవం ఉందన్నారు. రామ్‌నాథ్ కోవింద్ నిరాడంబరత, విధేయతకు తాను ఆకర్షితుడైనట్లు గెహ్లాట్ వివరించారు.