గృహ నిర్బంధంలో కృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు  అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను తెలంగాణ ప్రభుత్వం గృహ నిర్భందం చేసింది. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నివాళ్లు అర్పించకుండా దళితజాతిని అవమానం చేశారని ఇందిరాపార్కు వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి మందకృష్ణ పిలుపు నిచ్చారు. దీంతో ఇందిరాపార్కు వద్ద మందకృష్ణ రాకుండా పోలీసులు గృహ నిర్భందం చేశారు. ప్రభుత్వం చేసిన ఈ చర్యపై పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మండిపడ్డాయి.  

రాష్ట్రంలో దళితులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని  కృష్ణమాదిగ ఆరోపించారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని విరగ్గొట్టడం, జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనకపోవడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద ఆందోళనకు సిద్దమై, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తామన్న తమను నిర్బంధించడం దారుణమని ధ్వజమెత్తారు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని స్పష్టం చేశారు. 

అంబెడ్కర్  జయంతి ఉత్సవాలకు కేసీఆర్ రాకపోవడాన్ని తాము ప్రశ్నించాము తప్పు ఏముందని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 5 ఏళ్లు గడుస్తున్న ఒక్క సారి కూడా అంబేడ్కర్ జయంతి ఉత్సవాలలో కేసీఆర్ పాల్గొనలేదని గుర్తు చేశారు. పంజాగుట్టలోని అంబేడ్కర్ విగ్రహం విరగొట్టి డంపింగ్ యార్డ్ లో పడివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గృహనిర్బంధంలోని కృష్ణమాదిగను బుధవారం రాత్రి పలువురు నాయకులు పరామర్శించారు. వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, బిజెపి నేత జి.కిషన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, పీడబ్ల్యూవో జాతీయ కన్వీనర్‌ సంధ్య ఉన్నారు.

కేసీఆర్ పెడతాను అనిచెప్పిన 125 అడుగుల విగ్రహం కనపడడం లేదని, కానీ తమ  వాళ్ళు పెట్టుకున్న అంబేడ్కర్ విగ్రహలను మాత్రం విరగగొడుతున్నారని కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఎర్రవెల్లి లో ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడా కేసీఆర్ కనీసం పూల  దండ వేయలేదని గుర్తు చేశారు.