పార్టీ తీరుపై కాంగ్రెస్ అధికార ప్రతినిథి అలక

కాంగ్రెస్ అధికార ప్రతినిథి ప్రియాంక చతుర్వేది ఆ పార్టీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ఇచ్చిన ఓ ట్వీట్‌లో గతంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కార్యకర్తలపై సస్పెన్షన్ వేటును ఎత్తివేయడాన్ని తప్పుబట్టారు. పార్టీ నిర్ణయం దురదృష్టకరమని పేర్కొన్నారు. చెమటలు చిందిస్తూ పార్టీ కోసం పని చేసేవారికి ప్రాధాన్యం దక్కడం లేదని వాపోయారు.

‘‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చెమట, రక్తం ధారపోసినవారి కన్నా దుష్టులకు ప్రాధాన్యం దక్కడం పట్ల చాలా విచారిస్తున్నాను. పార్టీ కోసం సర్వత్రా రాళ్ళ దెబ్బలు తింటూ, దూషణలు భరిస్తున్నా, అయినప్పటికీ పార్టీలోనే నన్ను బెదిరించినవారు కనీసం తమ మండలపై ఓ దెబ్బ అయినా పడకుండానే తప్పించుకుంటున్నారు’’ అని ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.

తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కార్యకర్తలపై సస్పెన్షన్‌ను తొలగిస్తున్నట్లు ఆ పార్టీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఈ ట్వీట్‌తోపాటు ఆమె పోస్ట్ చేశారు.

పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో పత్రికా విలేకర్ల సమావేశంలో ప్రియాంక చతుర్వేది మాట్లాడినపుడు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. వారిపై కాంగ్రెస్ అప్పట్లో సస్పెన్షన్ వేటు వేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింథియా జోక్యం చేసుకోవడంతో సస్పెన్షన్లను రద్దు చేశారని తెలుస్తోంది.