దిగ్విజయ్ సింగ్ పై సాధ్వి ప్రగ్యా సింగ్ పోటీ !

మాలేగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీలో బుధవారం లాంఛనంగా భోపాల్ లోని బీజేపీ కార్యాలయంలో చేరారు. భోపాల్ నుండి పోటీ చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పై ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తాను ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని ఈ సందర్భంగా ఆమె భరోసా వ్యక్తం చేశారు.

సాధ్వి ప్రగ్యా సింగ్ బీజేపీలో చేరడానికి ముందు పార్టీ సీనియర్ నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్‌లాల్, అనిల్ జైన్, నరోత్తమ్ మిశ్రా, ప్రభాత్ ఝా తదితరులను పార్టీ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న వారిపై కలిసికట్టుగా పోరాటం సాగిస్తామని, ఈ ధర్మయుద్ధంలో తాము గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్ కుట్ర వల్ల పదేళ్లు జైలులో గడిపాను. రాజకీయ, మతపరమైన యుద్ధంలో పోరాడేందుకు నేను ఇక్కడకు వచ్చాను' అని ఆమె  చెప్పారు. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందగా, డజను మంది వరకూ గాయపడ్డారు.

అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేనందున సాధ్వి ప్రజ్ఞ సహా మరో ఐదుగురిపై ఆరోపణలను జాతీయ దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది. సుమారు ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆమె ఈ కేసులో ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యారు.కాగా, మధ్యప్రదేశ్‌లో చివరి నాలుగు విడతల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.