కాంగ్రెస్ కుట్రలో భాగమే ఇమ్రాన్ ఖాన్ వాఖ్యలు !

మోదీయే మరోసారి ప్రధాని కావాలంటూ ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు  కాంగ్రెస్‌ పార్టీ కుట్రల్లో భాగమేనని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు.  ‘‘అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారో తెలియదు. మోదీని గద్దె దించడం కోసం కాంగ్రెస్‌లోని ప్రముఖ నాయకులు పాకిస్థాన్‌కు వెళ్లి వారి మద్దతు కోరుతున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్‌ పథకాల్లో ఇది కూడా ఒక భాగమేనేమో అనిపిస్తోంది’’ అని సీతారామన్‌ పేర్కొన్నారు. 

అలాగే ఇటీవల తీవ్ర దుమారం రేపుతున్న విద్వేషపూరిత ప్రసంగాలను ప్రస్తావిస్తూ మహిళలపై నాయకులు విమర్శలు చేసే ముందు కాస్త జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. కనీస ఆలోచన లేకుండా మాట్లాడడం తగదని హితవు పలికారు. రామ్‌పూర్‌ బీజేపీ అభ్యర్థి జయప్రదపై ఆజంఖాన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ ఆమె ఈవిధంగా స్పందించారు. పార్టీలకతీతంగా నాయకుల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సూచించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేయాలని అభిప్రాయపడ్డారు. 

సైన్యాన్ని, సైనిక కార్యకలాపాలను రాజకీయం చెయ్యొద్దంటూ రాష్ట్రపతికి మాజీ సైనికాధికారులు లేఖ రాశారని వచ్చిన వార్తలపై కూడా సీతారామన్‌ కొట్టిపారవేసారు. లేఖలో సంతకం చేసినట్లు పేర్కొన్న అనేక మంది ప్రముఖ అధికారులు ఆ వార్తను ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో ఆ లేఖకు ఎటువంటి విశ్వసనీయతా లేదని అర్థమైందని చెప్పారు. 

సైన్యాన్ని రాజకీయం చేయడాన్ని తానూ వ్యతిరేకిస్తానని రక్షణ మంరి స్పష్టం చేశారు. కానీ బాలాకోట్ లాంటి కఠిన నిర్ణయాలు ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడంలో ఎలాంటి రాజకీయం లేదని అభిప్రాయపడ్డారు. అలాగే బాలాకోట్ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్థాన్‌ ఇప్పటికీ బుకాయిస్తోందని చెప్పారు. దాడి జరిగిన ప్రాంతానికి మీడియాను తీసుకెళ్లడానికి పాక్‌కు 40 రోజులు పట్టిందని..ఈ పర్యటనలో పాత్రికేయులను పాక్‌ ఆర్మీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందని ఆమె తెలిపారు.