విద్వేష ప్రసంగం చేసిన సిద్ధూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

వివాదాస్పదమైన కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బిహార్‌లోని కతియార్‌ జిల్లాలో ప్రచారం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘన కిందకే వస్తాయని భావించిన ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ముస్లిం సోదరులను ఓట్లు అభ్యర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పలువురు ఈసీకి ఫిర్యాదు చేశారు.

దానికి సంబంధించిన వీడియో సైతం అన్ని ప్రసార మాధ్యమాల్లో రావడంతో ఈసీ స్పందించింది. బరసోయ్‌ పోలీసు స్టేషన్‌లో ఎన్నికల తనిఖీ విభాగం ఫిర్యాదు మేరకు సిద్ధూపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసు అధికారి చంద్ర ప్రకాశ్‌ సైతం ధ్రువీకరించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు తెలిపారు. 

ఎన్నికల సందర్భంగా కతియార్‌ జిల్లాలో సిద్ధూ సోమవారం ప్రచారం నిర్వహిస్తూ ‘‘ఇక్కడ ముస్లింలు 64శాతం మంది ఉన్నారు. ఓవైసీలాంటి వారి వలలలో పడకుండా మీ బలాన్ని గుర్తెరిగి ఓటు వేయండి. మీరంతా కాంగ్రెస్‌ అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి తారిక్‌ అన్వర్‌కు ఓటు వేయాలి. ప్రధాని మోదీని ఓడించాలి’’ అని సిద్ధూ వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన బిజెపి నాయకులు ఆయన వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారు. విభజించి పాలించే విధానం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మతం ఆధారంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసిన యోగి ఆధిత్యనాథ్‌, మాయావతి, మేనకాగాంధీపై ఈసీ ఇప్పటికే చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.