మోదీలంతా ఎందుకు దొంగలవుతారు?

అభ్యంతరకర పదజాలం వాడటం నామ్‌ధార్‌ (రాహుల్‌)కు ఫ్యాషన్‌గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ‘మోదీలంతా ఎందుకు దొంగలవుతారు?’ అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బాలో మంగళవారం జరిగిన ఎన్నికలసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘గుజరాత్‌లోని సాహు సామాజిక వర్గం వారిని మోదీ అని పిలుస్తారు. వారంతా దొంగలేనా? ఇది మాట్లాడే భాషేనా? దుర్భాషలాడటం సాధారణమైపోయింది’ అని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలుపడం వల్లే ఈ ప్రాంతంలో నక్సల్స్‌ కార్యకలాపాలు సాగుతున్నాయని ప్రధాని ఆరోపించారు. గత మంగళవారం దంతేవాడ జిల్లాలో నక్సల్స్‌ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి మరణించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పాత్ర లేకుంటే మాండవిని నక్సల్స్‌ ఎలా చంపగలిగారని ప్రశ్నించారు. 

దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించడం నక్సలిజాన్ని ప్రోత్సహించడమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తన మ్యానిఫెస్టోలో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేస్తామన్నది. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో హామీలు చూసిన తర్వాత హింస, ఉగ్రవాద కుట్రదారులు సంతోషంతో నృత్యాలు చేశారని దుయ్యబట్టారు. మీ జాతి భద్రతతో రాజీ పడుతున్న కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి రావడానికి మీరు అనుమతినిస్తారా?’ అని ప్రజలను ప్రశ్నించారు.

‘కాంగ్రెస్‌ కా హాథ్‌ వికాస్‌ కే సాథ్‌ యా వినాశ్‌ కే సాథ్‌ (కాంగ్రెస్‌ పార్టీ వికాసం కోసమా? వినాశనం కోసమా?’ అని మోదీ నిలదీశారు. ‘నమ్మకద్రోహంలో కాంగ్రెస్‌ పార్టీ పీహెచ్డీ’ చేసిందని, ఆ పార్టీకి విధి విధానాలే లేవని మండిపడ్డారు. ఒక కుటుంబానికి బానిసలుగా ఉంటేనే కాంగ్రెస్‌ పార్టీలో గుర్తింపు లభిస్తుందన్నారు. ‘మందుపాతర్లు కావాలో, విద్యుత్‌, నీటి పైపులైన్లు కావాలో ఛత్తీస్‌గఢ్‌ వాసులు తేల్చుకోవాలి’ అని అన్నారు.