రాహుల్‌ ప్రచారాన్ని నిషేధించండి

రాఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందం విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కు బిజెపి ఫిర్యాదు చేసింది. ఇందుకు శిక్షగా ఆయనకు ఎన్నికల ప్రచారం చేపట్టకుండా నిషేధంతోపాటు ‘భారీ జరిమానా’ విధించాలని కోరింది. 

కేంద్ర మంత్రులు రవి శంకర్‌ ప్రసాద్‌, హర్‌దీప్‌ సింగ్‌ పురి తదితరులతో కూడిన బిజెపి ప్రతినిధి బృందం మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడాను కలసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. రాహుల్‌ గాంధీ పదేపదే ‘కాపలాదారు దొంగ’ అంటూ ప్రధానిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారని తెలిపింది. రఫేల్‌ వ్యవహారంలో సుప్రీం కోర్టుకు ఆపాదిస్తూ కొన్ని తప్పుడు వ్యాఖ్యానాలు కూడా చేశారని పేర్కొంది.

ఇలా ఉండగా, మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు 72 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విధించిన నిషేధాన్ని పునఃసమీక్షించాలని బిజెపి ఈసీని కోరింది. తన విశ్వాసాల గురించే యోగి మాట్లాడారని, మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలన్నది ఆయన ఉద్దేశం కాదని పేర్కొంది.

మరోవంక,  కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ బిహార్‌లో విద్వేషాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఆయనపై నిషేధం విధించాలని కోరింది.