హంగ్‌ భ్రమల్లో సీఎం కేసీఆర్‌

ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో  టీఆర్‌ఎస్  ది కీలకపాత్ర అంటూ కొత్త ప్రభుత్వంలో దూరేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అప్పుడే బేరసారాలు మొదలుపెట్టారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. కేంద్రంలో హంగ్‌ వస్తుందన్న భ్రమల్లో కేసీఆర్‌ ఉన్నారని, తెరాస వంటి పార్టీల అవసరం రాదని, ఎన్డీయే కూటమి 300కుపైగా స్థానాలతో సొంతంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 

ఇతర రాష్ట్రాల్లో పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తరఫున తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం చేయాల్సి ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమయమున్నా దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకొస్తోందని దుయ్యబట్టారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడితే స్థానిక ఎన్నికలపైనా ప్రభావం ఉంటుందన్న భయంతో ఆదరాబాదరాగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని ఆక్షేపించారు.

 54శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను సుప్రీంకోర్టు తీర్పు సాకుతో 23శాతానికి పరిమితం చేసి ఆ వర్గాలకు కేసీఆర్‌ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. వారికి న్యాయం జరిగేవరకు బిజెపి రాజకీయ పోరాటం చేస్తుందని తెలిపారు. 

అవినీతిని అరికట్టడానికి బిజెపికి అభ్యంతరమేమీ లేదని చెప్పారు. అయితే రెవెన్యూ, పురపాలక వంటి శాఖలను ప్రక్షాళన చేస్తానని సీఎం అనడం వెనకున్న మర్మం.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో  టీఆర్‌ఎస్  అభ్యర్థులను ఓడించినందుకు ఉద్యోగులపై కేసీఆర్‌ కక్ష గట్టడమేనని ధ్వజమెత్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ఒకేసారి జరిగి ఏపీలో పరీక్ష ఫలితాలు విడుదలైనా తెలంగాణలో ఆలస్యానికి కారణమేంటో చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ‘‘హాల్‌టికెట్ల జారీ, ఫలితాల వెల్లడి వంటి సాంకేతిక వ్యవహారాలను కొత్తగా గ్లోబరీనా అనే సంస్థకు ఇవ్వడం వెనుక ఏదో మతలబు ఉంది. ఇంటర్‌ ప్రశ్నాపత్రం లీకైనట్లు, జవాబుపత్రాలు గల్లంతైనట్లు వస్తున్న వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రులల్లో ఆందోళన కలిగిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది’’ అని దుయ్యబట్టారు.