ప్రతిపక్ష నేతలకు నిద్రలేని రాత్రులకు గురిచేస్తోంది

బీజేపీ ర్యాలీలకు భారీ  సంఖ్యలో ప్రజలు తరలిరావడం  ప్రతిపక్ష నేతలకు నిద్ర  లేని రాత్రులకు గురిచేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశాలోని సంబల్‌పూర్‌లో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో పాల్గొంటూ ఎంతో వేడిగా ఉన్నప్పటికీ  అంతమంది తరలి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

ఇంతమంది మాకు మద్దతు తెలుపుతున్నారంటే దానికి కారణం ప్రజలు శక్తిమంతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని, ఈ ప్రభుత్వం ఏర్పడకముందు ప్రజలు నిస్సహాయ, అవినీతికర ప్రభుత్వాన్ని చూశారని గుర్తు చేశారు. ఆ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. 

కొన్ని దశాబ్దాలుగా ఉన్న మైనింగ్‌ చట్టానికి తమ ప్రభుత్వం సవరణలు చేసినదాని, దీనివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయని ప్రధాని తెలిపారు. కాగా,  కేంద్రం అందిస్తున్న ప్రయోజనాలపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని మోదీ ప్రధాని ధ్వజమెత్తారు. నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే ఈ ప్రయోజనాలు అందిస్తున్నది కేంద్రమేనని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని స్పష్టం చేశారు. 

ఉదాహరణకు ఓ కుమారుడు దిల్లీ నుంచి మీకు ఓ బహుమానం పంపాడనుకోండి.. ఆ గొప్పదనం మీ కుమారుడికి ఇస్తారా? ఆ బహుమతిని మీ చేతికందించిన పోస్ట్‌మెన్‌కి ఇస్తారా? అని ప్రధాని ప్రశ్నించారు. ఆస్పత్రుల నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీటి కోసం ఒడిశాకు కేంద్ర సర్కారు రూ.6,000 కోట్లు కేటాయించిందని చెప్పారు. 

అయితే ఆ డబ్బు దుర్వినియోగం అయిందని, దానిలో కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ప్రధాని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను ఒడిశాలోని రైతులు అందుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేసారు. ఎందుకంటే ఇక్కడి రైతుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. అయినప్పటికీ తాము కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడి రైతులందరికీ ప్రయోజనాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు.