లఖ్‌నవూలో నామినేషన్‌ వేసిన రాజ్‌నాథ్‌

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు నగరంలో ఆయన రోడ్‌షో చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు.

అంతకుముందు స్థానిక హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్‌నాథ్‌ రోడ్‌ షోలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా పాల్గొనాల్సి ఉండగా.. ఈసీ ఆదేశాలతో ఆయన ర్యాలీకి రాలేదు.  

 కాగా.. రాజస్థాన్‌లోని జైపూర్‌ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ కూడా నేడు తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఉదయం రిటర్నింగ్‌ అధికారిని కలిసి నామపత్రాలు సమర్పించారు. ఆయన వెంట భార్య గాయత్రి రాథోడ్‌, యోగా గురు బాబా రాందేవ్‌ ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఈ రెండు స్థానాలకు మే 6న ఎన్నికలు జరగనున్నాయి. గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ లఖ్‌నవూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో యూపీ ఘాజియాబాద్‌ నుంచి గెలిచిన రాజ్‌నాథ్‌.. 2014 ఎన్నికల్లో లఖ్‌నవూ నుంచి విజయం సాధించారు. మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.