రాజీనామా చేయనని మొండికేస్తున్న డిఎస్

తనకు తానుగా టీఆర్ఎస్‌ కు రాజీనామా చేయనని ఒకవంక రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ మొండికేస్తుండగా, పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా బైటకు వెళ్ళేటట్లు చేయాలని మరోవంక అధికార పార్టీ నేతలు వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ, ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలనీ స్వయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కుమార్తె, నిజామాబాదు ఎంపి కవిత సారధ్యంలో నిజామాబాదు లోని పార్టీ నేతలు తీర్మానం చేసి పార్టీకి పంపగా, అప్పటి నుండి పార్టీలో ఆయన పరిస్థితి ఏమిటి తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

స్వయంగా కెసిఆర్ ను కలసి పరిస్థితులు వివరించడం కోసం శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తనకు కెసిఆర్ అప్పాయింట్మెంట్ కుడా ఇవ్వకుండా అవమాన పరిచారంటూ అప్పటి నుండి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ తాను టీఆర్ఎస్‌కు రాజీనామా చేయనని,

మరోవంక సిగ్గు, దమ్ముంటే డీఎస్ నోరుమూసుకుని టీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్థన్  తీవ్రమైన పదజాలంతో ద్వాజమెత్తడం దిగజారుతున్న పరిస్థితులను వెల్లడి చేస్తున్నది. డీఎస్ కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారని ఆయన  ఆరోపించారు.

పార్టీకి రాజీనామా చేస్తే తనపై వచ్చిన ఆరోపణలు నిజం అవుతాయని, అందుకే దయచేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయండని, లేకుంటే తనకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని శ్రీనివాస్ కోరుతున్నారు.

`నేను పార్టీకి నష్టం చేశానని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా తీర్మానం చేసి అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపారు. రాజకీయంగా నన్ను దెబ్బ తీసేందుకే ఇలా చేశారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికాను. నా వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేశానని ఆరోపణలు చేస్తున్నారని అంటూ అవేంటో నిరూపించాలని డిమాండ్ చేసారు.  మనసులో ఏదో పెట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.