మాయావతికి సుప్రీం కోర్ట్ లో చుక్కెదురు

48గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం తనపై ఆంక్షలు విధించడాన్ని బీఎస్సీ అధినేత్రి మాయావతి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై స్పందించిన కోర్టు మాయావతి పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. కావాలంటే మరో వ్యాజ్యం దాఖలు చేయాలని సూచించింది. దీన్ని తక్షణమే  విచారించాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. ఈసీ ఇప్పటికైనా మేల్కొని చర్యలకు ఉపక్రమించిందని అభిప్రాయపడింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు దీనిపై  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాజకీయ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలకు కళ్లెం వేసే దిశగా ఎన్నికల సంఘం సోమవారం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత అజంఖాన్‌లు 72 గంటల పాటు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీలు 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది. ప్రచారంలో భాగంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై సత్వర చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈసీ చర్యలకు ఉపక్రమించింది.