రాజస్తాన్ లో మహిళలకు ఉచిత మొబైల్ ఫోన్లు

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'డిజిటల్ ఇండియా' క్యాంపైన్‌కు ఊతమిచ్చేలా రాజస్థాన్ ప్రభుత్వం త్వరలోనే పేదరికపు రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాల్లోని మహిళలకు 'భామషా యోజన' కింద ఉచిత మొబైల్ ఫోనులు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

 కొత్త అప్లికేషన్లు కూడా సెల్‌ఫోన్లలో చేర్చనున్నామని, ఇందువల్ల చాలా తేలిగ్గా సెల్‌ఫోన్లలోని ఒక బటన్ నొక్కడం ద్వారా పేద ప్రజలు అన్ని ప్రయోజనాలు పొందే వీలుంటుందని ముఖ్యమంత్రి వసుంధరా రాజే సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. 5000 గ్రామ పంచాయతీల్లో వైఫై సౌకర్యం కల్పిస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. 

వసుంధరా రాజే ప్రభుత్వం ప్రజలను అడ్వాన్స్ టెక్నాలజీ వైపు అడుగులు వేసే దిశగా చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం కాదు. ఇటీవల అభయ్ కమాండ్ కేంద్రాలను దౌసా, శ్రీగంగానగర్, బకెర్, భిల్వారా, కరౌలీ, ధోల్‌పూర్‌లలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో డయల్ 100 మేనేజిమెంట్, ట్రాఫిక్ మేనేజిమెంట్, వీడియో సర్వెయిలెన్స్, సైబర్ ఫోరెన్సిక్ వంటి సౌకర్యాలు కల్పించారు. కాగా, రాజస్థాన్ అసెంబ్లీ గడువు 2019 జనవరి 20తో ముగియనుంది.