అప్పుడే 100 రోజుల ప్రణాళికపై మోదీ దృష్టి!

ప్రస్తుత లోక్ సభ ఎన్నికలలో మరిన్ని ఎక్కువ సీట్లతో గెలుపొంది, మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల ధీమాతో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఐదేళ్లల్లో చేబట్టబోయే పాలనా వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. ఒక వంక తీరికలేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, మరో వంక రెండంకెల వృద్ధి రేట్ సాధించడం పట్ల పట్టుదలగా ఉన్న ప్రధాని ఆ దిశలో అధికారంలోకి తిరిగి రాగానే తొలి 100 రోజులలో చేపట్టవలసిన పనుల గురించి ఒక నివేదిక సిద్ధం చేయమని అధికారులను కోరిన్నట్లు తెలుస్తున్నది.

రానున్న ఐదేళ్లలో సాధించాల్సిన రెండంకెల వృద్ధి రేటుకు అనుగుణంగా అజెండా రూపొందించాలని ప్రధానమంత్రి కార్యాలయం, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌, కేంద్ర శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహాదారును కోరినట్లు చెబుతున్నారు.

‘‘ప్రముఖ రంగాలైన ఆయిల్‌-గ్యాస్‌, ఖనిజాలు, మౌలిక వసతులు, విద్యారంగాల్లో ఉన్న సంక్లిష్టతలను తొలగించడంపై దృష్టి సారించాం. దీని ద్వారా 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి కావాల్సిన పునాదుల్ని రానున్న 100 రోజుల్లో వేయాలని సంకల్పించాం. కీలకరంగాల్లో ఉన్న సంక్లిష్టతలను తొలగించడం ద్వారా 2.5శాతం మేర వృద్ధి రేటు పెంచగలమని భావిస్తున్నాం’’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

 దేశం మొత్తం ఎన్నికలపై దృష్టి సారించగా.. పీఎంవో, నీతి ఆయోగ్‌, శాస్త్ర సాంకేతిక రంగాల కార్యాలయాలు మాత్రం అజెండా రూపకల్పనలో తలనమునకలైనట్లు తెలుస్తున్నది. దీంట్లో భాగంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా నిధుల సమర్థ వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కల్పనపై విస్తృత చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

మెరుగైన వృద్ధికి దోహదం చేసే మైనింగ్‌, బొగ్గు, ఇంధనం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల సృష్టిలో భాగంగా పర్యాటకం, సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమలు ఇలా పలు రంగాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మోదీ అధికారంలోకి వస్తే.. తాగునీటి వసతి, నదుల అనుంధానానికి అధిక ప్రాధాన్యం ఉండనుందని అధికారులు తెలిపారు. అందులో భాగంగా ఆనకట్టల నిర్మాణం, సింధూ నదీ జలాల సమర్థ వినియోగంపై దృష్టి సారించనున్నామన్నారు. అలాగే రహదారుల నిర్మాణం, విమానాశ్రయాల అభివృద్ధిపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నీతి ఆయోగ్‌ అధికారి ఒకరు తెలిపారు.