జమ్ముకశ్మీర్‌ లో మూడు తరాల భవిష్యత్తు నాశనం చేశారు

జమ్మూ కాశ్మీర్ లోని మాజీ ముఖ్యమంత్రులు  ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కుటుంబ రాజకీయాలు జమ్ముకశ్మీర్‌ ప్రజల మూడు తరాల భవిష్యత్తును నాశనం చేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ వారెన్ని కుయుక్తులు పన్నినాదేశాన్ని విడగొట్టే వారి ప్రయత్నాలను ఎంతమాత్రం సాగనీయమని స్పష్టం చేశారు. ఆరోపించారు. వారికి రాజకీయ విశ్రాంతినిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలిపారు. 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలంటూ ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ చేసిన డిమాండ్‌ను ప్రస్తావిస్తూ వాళ్లు తమ వర్గీయులందర్నీ తెచ్చుకుని మోదీని ఎలా కావాలంటే అలా తిట్టుకోవచ్చని, అయితే దేశాన్ని మాత్రం ఎప్పటికీ విడగొట్టలేరని పేర్కొన్నారు. జమ్మూ కావచ్చు, కశ్మీర్ కావచ్చు, లెహ్ లఢక్ కావచ్చు, ఈ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ సైతం భారతదేశ పౌరులేనని చెప్పారు. 

కశ్మీర్ పండిట్లు సొంతిళ్లు వదులుకుని లోయనుంచి వలస వెళ్లిపోవడానికి కాంగ్రెస్ విధానాలే కారణమని, కేవలం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే కశ్మీర్ పండిట్లపై జరిగిన అకృత్యాలను 60 ఏళ్లుగా చూస్తూ మిన్నకుండిపోయిందని మోదీ ఆరోపించారు. '60 ఏళ్లుగా పట్టని కశ్మీర్ పండిట్లకు ఎలా న్యాయం చేస్తారు? 1984 అల్లర్ల బాధితులకు న్యాయం చేయగలుగుతుందా?' అని ఆయన ప్రశ్నించారు. 

కశ్మీరీ పండిట్ల సమస్యలను పరిష్కరిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని చెబుతూ ఆ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. భారత్‌ను నమ్ముకుని పాక్‌ నుంచి వచ్చిన కుటుంబాలకు ఇక్కడి పౌరులుగా గుర్తించేలా చట్టం తీసుకువచ్చే యోచనలో ఉన్నామని చెప్పారు. 

గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 కంటే ఇప్పుడు బీజేపీ వైపు గాలి మరింత బలంగా వీస్తోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ కంటే మూడింతలు అధిక సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జమ్ము, బారాముల్లాలో జరిగిన తొలి విడత ఎన్నికల్లో అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటారని ప్రజల్ని కొనియాడారు. దీంతో ఉగ్రనేతలు, అవకాశవాదులకు గట్టిగా సమాధానం చెప్పారన్నారు.

జలియన్‌వాలా బాగ్‌ ఉదంతానికి 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా.. దేశం మొత్తం అమరులకు నివాళులర్పిస్తే  కాంగ్రెస్‌ మాత్రం ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేసిందని ప్రధాని దుయ్యబట్టారు.  ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరైతే.. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ మాత్రం అక్కడకి రాకపోవడాన్ని ప్రధాని తప్పుబట్టారు. 

కాంగ్రెస్‌ వారసుడితో వెళ్లి నివాళులర్పించిన ఆయన ప్రభుత్వ కార్యక్రమానికి మాత్రం రాలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ కుటుంబానికి భక్తిని చాటడంలో నిమగ్నులయ్యారని ఎద్దేవా చేశారు. అమరీందర్‌ దేశభక్తి గురించి తనకు తెలుసని.. ఆయనపై ఎంత ఒత్తిడి ఉంటే ఇలా వ్యవహరిస్తారని పరోక్షంగా కాంగ్రెస్‌ అధిష్ఠానంపై విరుచుకుపడ్డారు. మెరుపు దాడుల పదం వింటే కాంగ్రెస్‌ ఎందుకు ఉలికిపడుతోందని ప్రశ్నించారు.