కేంద్ర సర్వీస్ లకు క్యూ కడుతున్న ఏపీ అధికారులు !

ఏపీలో ప్రభుత్వం మార్పు తధ్యమనే భావనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన, ముఖ్యమంత్రికి సన్నిహితులుగా భావించిన పలువురు సీనియర్ అధికారులు కేంద్ర సర్వీస్ లకు క్యూ కడుతున్నట్లు తెలుస్తున్నది.  ఎన్నికల సమయంలో కొనసాగడానికి వీలేదని, మార్చాలని స్వయంగా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన డిజిపి ఆర్ పి ఠాకూర్ వారిలో ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు.

ముగ్గురు సీనియర్‌ అధికారులు ఈ దిశలో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డిఓపిటి) కి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు, వివిధ శాఖల్లో కీలక బాధ్యతలో ఉన్న మరో నలుగురు అదే సన్నాహాల్లో ఉన్నారు. డిజిపి ఠాకూర్‌తో పాటు, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజరుజైన్‌, సిఎం కార్యాలయ కార్యదర్శి గిరిజా శంకర్‌లు తమను ఆంధ్రప్రదేశ్‌ సర్వీసుల నుండి తప్పించమని కోరుతూ డిఓపిటికి ఇప్పటికే లేఖ రాశారు.

టిడిపికి సన్నిహితంగా వ్యవహరించిన మరికొందరు అధికారులు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఎపిఎండిసిలో సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి, సీఎం కార్యాలయంలో ఉన్న ఇతర రాష్ట్రాల కేడర్‌కు చెందిన మరో అధికారి, ఎకానమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులో అత్యున్నత స్థాయి అధికారితో పాటు, గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం ఒక కీలక శాఖలో పనిచేస్తున్న మరొకరు కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  డిఓపిటికి ఈ దిశలో వీరు దరఖాస్తు చేయనప్పటికీ మౌఖికంగా సంప్రదించినట్లు తెలిసింది. అవసరమైతే తమను తక్షణం బదిలీ చేయాల్సిఉంటుందని వీరు కోరినట్లు చెబుతున్నారు.