రాజకీయ అసహనానికి మోదీ అతిపెద్ద బాధితుడు

కొందరి రాజకీయ అసహనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అతిపెద్ద బాధితుడని కేంద్రమంత్రి, బీజేపీ నేత ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ పేర్కొన్నారు. 

‘తమను తాము మేధావులుగా చెప్పుకునే కొందరు.. ఐదేళ్ల క్రితం కూడా మోదీకి వ్యతిరేకంగా అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లకు లేఖలు రాశారు. కాంగ్రెస్‌ నేతలు కొందరు పాకిస్థాన్‌కు వెళ్లి మోదీని అధికారం నుంచి తొలగించడానికి సాయం చేయాలని కోరారు.బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు రాష్ట్రపతికి లేఖలు రాశారు. మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, అసహన వాతావరణం పెరిగిపోయిందని అన్నారు’ అని గుర్తు చేశారు. 

‘ఇన్ని కుట్రలు చేసినప్పటికీ మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఆయనపై ప్రతికూల ప్రచారాలు చేస్తున్నప్పటికీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తన సమర్థత, కష్టపడి పనిచేసేతత్వం వల్ల మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారు’ అని నఖ్వీ కొనియాడారు. 

దేశ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, ప్రధాని మోదీని మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలని లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొందరు పిలుపు ఇవ్వడం పట్ల మండిపడుతూ ఈ వాఖ్యలు చేశారు.