60 ఏళ్ల పాలనలో న్యాయం చేయలేదని కాంగ్రెస్ ఒప్పుకొంటుందా !

కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘న్యాయ్‌’ పథకాన్ని ఉటంకిస్తూ ‘‘కాంగ్రెస్‌ వారు ‘ఇప్పుడు న్యాయం జరుగుతుంది (అబ్‌ హోగా న్యాయ్‌)’ అని నినదిస్తున్నారు. అంటే 60 ఏళ్ల వారి పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదని ఒప్పుకున్నారు’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిలదీశారు. తమిళనాడులో డీఎంకేతో కలిసి ‘మహాకల్తీ’ కూటమిని ఏర్పాటు చేశారని తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలో భారతదేశం కొత్తపుంతలు తొక్కుతోందని.. అది చూసి ప్రతిపక్ష కూటమి సంతోషంగా ఉండలేపోతోందని ఆరోపించారు. 

గతంలో ఎన్నో అవమానాలకు గురి చేసినప్పటికీ.. అధికారం కోసం తిరిగి కాంగ్రెస్‌తో చేతులు కలిపారని పరోక్షంగా డీఎంకేపై మోదీ విమర్శలు గుప్పించారు. డీఎంకే అధినేత స్టాలిన్ ప్రతిపాదించినట్లు ప్రధానిగా రాహుల్‌ను.. వారి కూటమిలో ఎవరూ అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. మహాకూటమిలో చాలా మంది ప్రధాని పదవి కోసం వేచిచూస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్‌ కేసులోనూ డీఎంకే నేతలు కాంగ్రెస్‌ను విమర్శించారని గుర్తు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ తనను ఓడించడం కోసం ఏకమయ్యాయని దుయ్యబట్టారు. 

ఈ సందర్భంగా అన్నాడీఎంకే దివంగత నేతలు జయలలిత, ఎంజీ రామచంద్రన్‌ సేవల్ని మోదీ గుర్తుచేసుకున్నారు. థేనీ ఆ ఇద్దరు మహానాయకులకు చెందిన ప్రాంతమనీ.. ఇక్కడ బరిలో నిలపడానికి కాంగ్రెస్‌కు కనీసం స్థానిక నేతలు కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. 39 లోక్‌సభ స్థానాలతో పాటు 18 అసెంబ్లీ సీట్లకు తమిళనాడులో ఏప్రిల్‌ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే, బిజెపి  కూటమిగా ఏర్పడగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌, డీఎంకే కలిసి బరిలోకి దిగనున్నాయి.