ఏపీలో కనుమరుగు కానున్న టిడిపి

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగు కానుందని, ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ భర్తీ చేస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుస్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున ఓటు వేశారని తెలిపారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం కనిపించిందని చెప్పారు. తప్పుడు విమర్శలతో ప్రజల్లో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని ధ్వజమెత్తారు. 

తన స్థాయి మరచి  రాజకీయాలు చేసి కేంద్రంపై బురద జల్లుతూ అసత్య ఆరోపణలు చేశారని జివిఎల్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో రౌడీయిజం చేసి ధన బలంతో గెలవాలని ముఖ్యమంత్రి ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు గ్రహించి, ఆయనను తిరస్కరించారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు డబ్బు, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టాయని దుయ్యబట్టారు. బీహార్‌లో పాత రోజులు గుర్తు చేసే విధంగా వ్యవహరించాయని తెలిపారు. 

రాష్ట్రంలో ధన, ప్రలోభ రాజకీయాలతో అధికారంలోకి వచ్చేందుకు ఆరాటపడ్డారని విమర్శించారు. వేల రూపాయలను పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా ఓటు కొనుగోలు చేయవద్దంటూ మరింత ప్రచారం చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రలోభాల కారణంగా నిజంగా పని చేసేవారు రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబు, జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. 

ఈ సారి ఎన్నికల్లో పెద్దస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందని, లోక్‌సభకు కమలం గుర్తుపై ఓటేసినట్లు తెలుస్తోందని చెప్పారు. ఎన్నికల్లో బిజెపి ఓట్ల శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీ బలోపేతంపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడతామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ శూన్యాన్ని బీజేపీ భర్తీ చేస్తుందని చెప్పారు. భద్రతా సిబ్బందిని చాలినంతగా కేటాయిస్తే రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు.