రాహుల్ మహా కూటమిని ‘విభజన గ్యాంగ్

రాహుల్ నేతృత్వంలోని మహా కూటమిని ‘విభజన గ్యాంగ్’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. బిహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే.. అవినీతి దుకాణం బంద్ అవుతుందని, వారసత్వ రాజకీయాలకు ఆటంకం ఏర్పడుతుందని రాహుల్ నేతృత్వంలోని మహా కల్తీకూటమి భయపడుతోందని తెలిపారు.

అందుకే తనను తప్పించాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తీవ్రవాదులకు, మావోయిస్టుల నుంచి దేశాన్ని రక్షించేందుకు భద్రతా దళాలకు స్వేచ్చ ఇవ్వాలని తాము భావిస్తున్నామని తెలిపారు. అయితే భద్రతా దళాలకు ప్రత్యేక అధికారాలు తొలగించాలని రాహుల్ అంటున్నారని విమర్శించారు. మీ ఓట్లను అడగడానికి రాహుల్ నేతృత్వంలోని కూటమి వచ్చినప్పుడు మీరు తీవ్రవాదుల వైపా..? జవాన్ల వైపు ఉన్నారా..? అని ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు.

తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికలు జరగవని, రాజ్యాంగ సంస్థలకు ముప్పని, రిజర్వేషన్లు తొలగిస్తారని మహా కూటమి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఈ చౌకీదార్ ఎవరి రిజర్వేషన్లు తగ్గించకుండా ఆర్ధికంగా బలహీనమైన వర్గాల కోసం 10 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు. తద్వారా ఆర్ధిక వివక్షకు చరమగీతం పాడాలని నిజాయతీగా పని చేశామని చెప్పారు.

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల శిబిరాలను తొలగించడం ద్వారా వారిని ఏరివేస్తున్నామని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ తరహాలో రాహుల్ అండ్ కూటమి మాట్లాడుతోందని విమర్శించారు. నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించామని తెలిపారు. 

పౌరసత్య సవరణ బిల్లును ఆమోదించడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు. అసోంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ  అధికారంలోకి రాగానే ఈ బిల్లును ఆమోదిస్తామని చెప్పారు. ఈ బిల్లును కూడా కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఉన్న మన పిల్లలు.. మందిరాలకు, గురుద్వారాలకు కూడా వెళ్లని పరిస్థితి నెలకొందని తెలిపారు. వారు అక్కడ హింసకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వారిని ఇక్కడికి రప్పించాలన్న ఉద్దేశంతోనే తాము సవరణ బిల్లును తెచ్చామని చెప్పారు. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. మన వాళ్లే ఇక్కడ విదేశీయులుగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా..? అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా.. ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా ఆమోదిస్తామని చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. మన కుమార్తెలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.