ఓటింగ్‌లో రికార్డు స్థాయిలో పాల్గొనాలి

దేశవ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు ప్రారంభమైన సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో 91లోక్‌సభ స్థానాలను, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్‌ మొదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు ట్విటర్‌ ద్వారా సందేశమిచ్చారు. 

‘‘2019 లోక్‌సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి విడతలో ఎన్నికలు జరగబోతున్న నియోజకవర్గాల పరిధిలోని ప్రజలంతా రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని కోరుతున్నాను. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న యువతీ-యువకులంతా భారీ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్‌లో ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. . అలాగే నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ ఓటు వేసి..‘ఓటు వేయడం మన బాధ్యతని ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి’ అని కోరారు.