హిందువులను కించపరిచే కేసీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టిన ఈసీ !

హిందువులను కించపరిచే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు చేసిన వాఖ్యాలను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తప్పుబట్టింది.  ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణ చేస్తూ ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చంద్రశేఖరరావు కరీంనగర్ మీటింగ్‌లో మాట్లాడుతూ హిందువులను కించపరిచారంటూ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఏం రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నకల సంఘం ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

దీనిపై ఏప్రిల్‌ 12 సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మార్చి 17న అక్కడ జరిగిన సభలో సీఎం అభ్యంతర వ్యాఖ్యలు చేశారని వీహెచ్‌పీ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ సీఈవో నుంచి ఆ మాటలకు సంబంధించి ఆంగ్ల తర్జుమాను, వాస్తవ నివేదికను ఎన్నికల సంఘం తెప్పించుకొని పరిశీలించింది. 

కేసీఆర్ కరీంనగర్ ఎన్నికల సభలో మాట్లడుతూ హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం ద్వారా ఇతర వర్గాల ఓట్లు సంపాదించేందుకు ప్రయత్నించారని రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు రామరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. హిందువులను కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేసినట్టు తాము భావిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తమ షోకాజ్ నోటీసులో అభిప్రాయపడింది. 

హిందువులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల వల్ల మత సామరస్యాన్ని చెడగొట్టే ప్రమాదం ఉన్నదనీ, వివిధ మతాల వారి మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలను మరింతగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సీఈసీ అభిప్రాయపడింది. సమాజంలోని వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని భగ్నం చేసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నట్టు స్పష్టం చేసింది. మతపరమైన భావాలను రెచ్చగొట్టటం ద్వారా మీరు ఎన్నికల ప్రవర్తనా నిమయావళిని ఉల్లంఘించారని చంద్రశేఖరరావుకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో సీఈసీ అభిప్రాయపడింది. 

ఓట్ల కోసం కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి, విభేదాలు సృష్టించడం చట్ట విరుద్ధమనే అంశాన్ని సీఈసీ తన నోటీసులో పేర్కొంది.  గడువులోగా వివరణ ఇవ్వడంలో విఫలమైతే తదుపరి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలసంఘం నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్‌కు పంపిన నోటీసులో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్‌కే రుడోలా పేర్కొన్నారు. 

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పేరా 1 (1) ప్రకారం ఏ అభ్యర్థీ సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తేలా, పరస్పరం ద్వేషభావం పెంచేలా వ్యవహరించకూడదని; కుల, మతాల ఆధారంగా ఓట్లు వేయాలని పిలునివ్వడం నిషేధమని, ప్రస్తుత కేసులో కేసీఆర్‌ ఈ నిబంధనను ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

 తాము చేసిన ఫిర్యాదుపై ఈసీఐ స్పందించి సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు, అధికార ప్రతినిధి రావినూతన శశిధర్‌, భజరంగ్‌దళ్‌ నగర కన్వీనర్‌ ముఖేష్‌ యాదవ్‌లు తెలిపారు. కేసీఆర్‌కు చట్టపరంగా శిక్షపడే వరకు వీహెచ్‌పీ న్యాయపోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు.