కర్ణాటక తర్వాత కాంగ్రెస్ కు ఏటీఎం లా ఎంపీ !

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నేతల నివాస ప్రాంతం తుగ్లక్ రోడ్ ఎన్నికల కుంభకోణానికి కేంద్రబిందువుగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. పేదలు, గర్భిణీలకు దక్కాల్సిన డబ్బులనూ కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఎంపీగా ఉన్నప్పుడు తుగ్లక్ రోడ్‌లో నివాసముండేవారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎంపీగా అధికార నివాసం కూడా తుగ్లక్ రోడ్‌లోనే ఉన్నది. 

ఇటీవల మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సన్నిహితుల ఇండ్లపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని జునాగఢ్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడిన కొందరిని (కాంగ్రెస్ నాయకులు) ఈ ఐదేండ్లలో జైలు తలుపుల వరకు తీసుకెళ్లానని, మళ్లీ అధికారం అప్పగిస్తే వారిని జైల్లోకి పంపిస్తానని స్పష్టం చేశారు. 

ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలకు కర్ణాటక ఏటీఎంలా ఉండేది. ఇప్పుడు మధ్యప్రదేశ్ కూడా ఏటీఎం లా మారిందని ప్రధాని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కనీసం ఆరు నెలలు కూడా కాలేదు. కానీ గత 3, 4 రోజుల నుంచి మనం మీడియాలో చూస్తున్నాం. ఎలా డబ్బులు పట్టుబడింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లోనూ పరిస్థితి అలాగే ఉన్నది. కేవలం పేదలను దోచుకోవడానికే ఆ పార్టీ అధికారాన్ని కోరుకుంటున్నది అని ప్రధాని మోదీ విమర్శించారు. 

మధ్యప్రదేశ్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదని, దేశాన్ని దోచుకోవడమే ఆ పార్టీ పనిగా మారుతుందని ప్రధాని హెచ్చరించారు. కాంగ్రెస్ చరిత్ర అంతా ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతుంటుందని దుయ్యబట్టారు. ఎంత తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులైనా బెయిల్ లభించేలా కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ఉన్నది. ఇది ఎవరి కోసం? మీ నేతల కోసమేనా?  అని ప్రశ్నించారు. 

ఈ ఐదేండ్లలో వారిని జైలు గోడల వరకు తీసుకెళ్లా. మళ్లీ అవకాశం ఇవ్వండి. ఈసారి ఏకంగా జైలు లోపలికే పంపిస్తా అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పొరుగున ఉన్న పాక్‌పై వైమానిక దాడులు చేపడితే మన విపక్షాలకు నొప్పి కలిగిందని, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కడుపునొప్పి వచ్చిందని ఎద్దేవా చేశారు. వైమానిక దాడులు చేపడితే కాంగ్రెస్ ఆధారాలు అడుగుతున్నదని ధ్వజమెత్తారు. 

తమ ప్రాణాలనూ లెక్క చేయకుండా పాక్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేపట్టిన భారత వాయుసేన వైపు నిలుబడుతారా? లేక ఆధారాలు కావాలంటున్న కాంగ్రెస్ వైపు నిలబడుతారా? అని ప్రధాని మోదీ ప్రజలను ప్రశ్నించారు. యూపీఏ హయాంలో (పదేండ్ల పాలనలో) రిమోట్‌కంట్రోల్ పాలన సాగిందని ఆరోపించారు. 

ఎప్పుడైతే ఈ దేశం భద్రత పరంగా పటిష్ఠంగా ఉంటుందో అప్పుడే సంపన్న దేశంగా మారుతుందని చెప్పారు. "నన్ను విమర్శించడానికి కాంగ్రెస్ డిక్షనరీలో ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని పదాలను వాడుతున్నది. మీ బిడ్డనైనా నన్ను, చౌకీదార్‌ను అనరాని మాటలు అంటున్నది. ఉగ్రవాదాన్ని తొలిగించాలని నేను చూస్తుంటే.. వారు నన్ను ప్రధాని పీఠం నుంచి తొలిగించాలని చూస్తున్నారు" అని ప్రధాని మోదీ ఆరోపించారు.