జంట పేలుళ్ళు కేసులో ఇద్దరు దోషులే

హైదరాబాద్‌లో గతంలో తీవ్ర కలకలం రేపిన జంట పేలుళ్ళు (గోకుల్‌చాట్, లుంబిని పార్క్) కేసులో ఇద్దరినీ దోషులుగా నాంపల్లి ప్రత్యేక కోర్టు తేల్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్కుల్లో పేలుళ్లు జరిగిన 11 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం అయిదుగురు నిందితుల్లో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. అక్బర్ ఇస్మాయిల్, అనిక్ షరీక్ సయిద్‌‌లను దోషులుగా నిర్ధారించింది. వీరికి వచ్చే సోమవారం శిక్షలు ఖరారు చేయనుంది. మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది.

2007 అగస్టు 25వ తేదిన సాయంత్రం జరిగిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ళలో మొత్తం 44 మంది మృతి చెందగా, 68 మంది గాయపడ్డారు. మొదట లుంబిని పార్క్‌లో రాత్రి జరిగిన పేలుళ్ళలో 12 మంది చనిపోయారు. 15 నిమిషాల తేడాలలో గోకుల్ చాట్‌లో జరిగిన పేలుడులో 32 మంది చనిపోయారు. హైదరాబాద్‌లో ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పేలుడుకు పాల్పడ మొదటి సంఘట ఇదే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ జంట పేలుళ్ళతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ రెండు కేసులను మొదట సిట్ అధికారులు కేసును నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటైన అక్టోపసు ఈ కేసు విచారణను నిర్వహించింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కోర్టు విచారణను మొత్తం కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు చేపట్టి పూర్తి ఆధారాలు నిందితుల పాత్రల నిర్ధారణకు సంబంధించిన అంశాలను కోర్టు విచారణలో పోందుపర్చారు.

ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుల్లో ఒక్కరైనా రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీరజాఖాన్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ, అనీక్ షఫీక్ సయ్యిద్, ఫారూక్ షర్ఫూద్దీన్ తర్కాష్ , మహ్మద్ సాధిక్ ఇస్రార్ అహ్మద్, తారీఖ్ అంజూమ్‌లు ఈ కుట్రకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి.

అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ, అనీక్ షఫీక్ సయ్యిద్, ఫారూక్ షర్ఫూద్దీన్ తర్కాష్ , మహ్మద్ సాధిక్ ఇస్రార్ అహ్మద్, తారీఖ్ అంజూమ్‌లు అరెస్టు కాగా రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీరజాఖాన్‌లు పరారీలో ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ రియాజ్ భత్కల్ పాకిస్థాన్, దుబాయ్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు నిఘా, పలు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.