అమేథీకి ప్రాధాన్యత ఇవ్వని రాహుల్... స్మ్రితి ఎద్దేవా !

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వరుసగా మూడు సార్లు ఎన్నుకున్నప్పటికీ అమేథీ నియోజకవర్గానికి తగు ప్రాధాన్యత  ఇవ్వడం లేదని ఆయనపై వరుసగా రెండోసారి అక్కడి నుండి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తనకు ఓటమి చెందినప్పటికీ ఇక్కడే ఉంది నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె ‘గత లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి, ఇప్పుడు కేరళలోని వయనాడ్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదట ఆ లోక్‌సభ స్థానానికి వెళ్లి నామినేషన్‌ వేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేను మాత్రం ఇప్పటికీ మీతోనే ఉన్నాను' అని గుర్తు చేశారు. 

2014లో రాహుల్‌ ఇక్కడి నుంచి గెలిచినప్పటికీ, మొదటి ప్రాధాన్యతను వయనాడ్‌కే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ స్థానం తర్వాతే అమేఠీకి ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. అమేఠీ ప్రజలు ఈ అవమానాన్ని సహిస్తారా?’ అంటూ ఆమె ప్రశ్నించారు. 

‘నామినేషన్‌ దాఖలు చేయడానికి అమేఠీ ఎంపీ రాహుల్‌ ఈ రోజు ఇక్కడకు వచ్చారు. అనంతరం తనకు ఓట్లు వేయమని కూడా ఆయన ప్రజలను అడగలేదు. ఈ ప్రాంత ప్రజలకు ఇది అవమానకరం. నేను గురువారం నామినేషన్‌ దాఖలు చేస్తాను. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఆ సమయంలో నా వెంట ఉంటారు’ అని స్మృతి ఇరానీ తెలిపారు. 

కాగా, అమేఠీలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి. ఆ నియోజక వర్గంలో రాహుల్‌కి పోటీగా స్మృతి ఇరానీ నిలిచారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటూ ఆమె బిజీగా ఉంటున్నారు.