తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు విస్తృత ఏర్పాట్లు

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు ఎన్నికల కమీషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో రేపు పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీలో గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 

ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో అధికారులు సిబ్బందికి అందజేశారు. అనంతరం పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్‌ బూత్‌లకు ప్రత్యేక వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా ఉండే పోలింగ్‌ కేంద్రాల వద్ద మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అధికారులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

 ఆంధ్రప్రదేశ్‌లో 46 వేల 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,118 మంది..  25 లోక్‌సభ నియోజకవర్గాలకు 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మిగిలిన నియోజకవర్గాల్లో యథావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. సుమారు 10 లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

అంతేకాకుండా 5 లక్షల 27 వేల మంది వరకూ దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరి కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 56,908 మంది సర్వీసు ఓటర్లు , 5,323 మంది ప్రవాసాంధ్రులు కూడా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లోనే వీవీ ప్యాట్లను వినియోగిస్తున్న ఈసీ.. తొలిసారి బ్యాలెట్ యూనిట్లపై అభ్యర్థుల ఫోటోలను కూడా ముద్రిస్తోంది. 

తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో  పోలింగ్‌ జరగనుంది. నిజామాబాద్‌లో మాత్రం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34,603 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఇతర సామగ్రితో ఎన్నికల సిబ్బంది తరలి వెళ్తున్నారు. సీఎం కేసీఆర్‌ రేపు చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

తెలంగాణలో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికల బరిలో 443 మంది అభ్యర్థులు నిలిచారు. నిజామాబాద్ నుంచి అత్యధికంగా 185 మంది.. అత్యల్పంగా మెదక్‌ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.రాష్ట్రంలో మొత్తం 34,603 పోలింగ్‌ కేంద్రాల్లో 5,749 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 

ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఇక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే అప్రమత్తమయ్యేందుకు రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు వెల్లడించారు.