కాంగ్రెస్ కు గుజరాత్ ఓబిసి ఎమ్యెల్యే అల్పేష్ ఠాకూర్ బై!

సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగలనుంది. అధికార బీజేపీని ఎదిరించి కొద్దికాలంలోనే సంచలనం సృష్టించిన యువనేత, ఓబీసీ ఉద్యమ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ ఆ పార్టీకి రాజీనామా చేసి పెద్ద షాక్ ఇచ్చారు. బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు పార్టీని వీడుతున్నారు. 

ఠాకూర్ ప్రారంభించిన గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన కార్యవర్గం సమావేశమై 48 గంటల లోగా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్యెల్యే పదవికి  రాజీనామా చేయమని తమ నేతకు స్పష్టం చేసింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొనలేదు. పఠాన్ లోక్ సభ సీట్ నుండి పోటీ చేయాలి అనుకొంటే కాంగ్రెస్ అల్పేష్ కు సీట్ ఇవ్వక పోవడం, తన సేనకు చెందిన మరో నేతకు సబర్కంతా సీట్ ఇవ్వమని కోరినా పట్టించుకొనక పోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఠాకూర్ సేనను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. 

కొంత కాలంగా సొంత పార్టీపైనే అసంతృప్తితో ఉంటున్నారు. ఠాకూర్‌ నాయకుల పట్ల కాంగ్రెస్‌ సరైన రీతిలో వ్యవహరించట్లేదని, తమకు తగిన ప్రాతినిథ్యం లభించట్లేదని అల్పేష్‌ తన అనుచరులతో వాపోతున్నారు.  కాంగ్రెస్ గుజరాత్ యూనిట్ పనితీరు పట్ల ఈ మధ్య తన అసంతౄప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. 

మొదట్లో బిజెపికి  వ్యతిరేకంగా ఓబిసి నేతగా ఠాకూర్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రోత్సహించేవారు. ఎప్పుడు మాట్లాడాలి అన్నా హాట్ లైన్ లో అందుబాటులో ఉండేవారు. అయితే గుజరాత్ కాంగ్రెస్ నేతలతో అల్పేష్ ఇమడలేక పోవడంతో రాహుల్ సహితం దూరం జరుగుతూ వచ్చారు. దానితో పార్టీ నుండి బయటకు రావడం కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు.