పోలీసులే టీడీపీ తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారు

సత్తెనల్లి నియోజకవర్గంలో పోలీసులే టీడీపీ తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారని  బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని పార్టీ ఎంపీ జివిఎల్ నరసింహరావుతో పాటు కలసి ఎన్నికల్లో టీడీపీ దురాగతాలకు అడ్డుకట్టవేయాలని చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు చింతామణి డ్రామాని రక్తికట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు.  

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు  స్టిక్కర్లు వేసుకుని ఏపీలో లబ్ధిపొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని  కన్నా ధ్వజమెత్తారు.  ఓటమి భయంతో టీడీపీ అనేక డ్రామాలు ఆడుతుందని ఆరోపిస్తూ రాష్ట్రంలో డబ్బు, మద్యం ఏరులై పారుతుందని చెప్పారు.  డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు డబ్బులు పంచుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులే టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, పోలీసు వాహనాలు, అంబులెన్స్‌ల్లో డబ్బులు తరలిస్తున్నారని దుయ్యబట్టారు. 

ఐటీ దాడులపై గల్లా జయదేవ్ ఆఫీస్‌కు చెందిన వాళ్లే పక్కా ప్లాన్ ప్రకారం డ్రామా ఆడారని కన్నా పేర్కొన్నారు. చంద్రబాబుది బ్లాక్‌మెయిలింగ్‌ స్వభావమని, ముందుకాళ్లకి బంధం వేయటంలో ఆయన దిట్టని విమర్శించారు. తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తోన్న ఈసీని బెదిరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్వతంత్ర సంస్థలను కూడా టీడీపీ బ్లాక్ మెయిల్ చేస్తుందని ధ్వజమెత్తారు. 

ఎలక్షన్ కమిషన్‌ను పార్టీలకు అంటగట్టడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబు డ్రామాలకు రేపటితో తెర పడుతుందని వ్యాఖ్యానించారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో టీడీపీ మొదటి స్థానంలో ఉందని దుయ్యబట్టారు.  

 అధికార పార్టీ ద్వారా వేల కోట్ల నల్లధనం చేతులు మారాయని జీవీఎల్ ఆరోపించారు. చంద్రబాబు దిగజారుడు మాటలు రాజకీయ దివాళా కోరుతనమని వ్యాఖ్యానించారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి రాలేదని పేర్కొన్నారు. చంద్రబాబు ముందుగానే తన ఓటమిని అంగీకరించారని చెప్పారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగితే పారదర్శకంగా ఉండేవని వెల్లడించారు.

ఈసారి టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. పోలింగ్‌ రోజున కూడా టీడీపీ కుట్రలు పన్నే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.