మరోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి అవుతారని కేంద్ర జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాల్లో నిర్ణయించేది ప్రధాన మంత్రేనని స్పష్టం చేశారు.

‘ ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న నిర్ణయం తీసుకునే అధికారం ప్రధాని ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే మెజారిటీ స్థానాలు వస్తాయన్న విశ్వాసం నాకుంది. మోదీజీ మళ్లీ ప్రధాన మంత్రి అవుతారు’అని గడ్కరీ పేర్కొన్నారు. 

బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే నితిన్ గడ్కరీ ప్రధాని అవుతారన్న కథనాలు వెలువడ్డాయి. అటు పార్టీలోనూ ఇటు బయట సీనియర్ నేత గడ్కరీనే ప్రధాని పదవి వరించే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా తనకు ప్రధాన మంత్రిని అవ్వాలన్న కోరిక లేదని బదులిచ్చారు. ఓ వర్గం మీడియా ఇలాంటివి సృష్టిస్తోందని కేంద్రమంత్రి ఆరోపించారు. 

నాగ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న గడ్కరీ వివాదాలు సృష్టించకుండా జాతీయ ప్రయోజనాలు కాపాడే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఆర్థిక విధానాలపై చర్చించాల్సిన తరుణం ఇది’అని బీజేపీ సీనియర్ నేత స్పష్టం చేశారు.