భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలతో కూడిన మేనిఫెస్టో బీజేపీది కాదని.. కాంగ్రెస్ మేనిఫెస్టోనే అసత్యాలతో నిండిపోయిందని విమర్శించారు.
బిజెపితో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకున్న అనంతరం తమ కూటమి నిర్వహించిన తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రకటించిన మేనిఫెస్టోకు మద్దతు తెలిపారు. 28 నెలల తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ఒకే వేదికపై పాల్గొన్నారు.
‘రాహుల్ జీ.. మీ నానమ్మ (ఇందిరా గాంధీ) కూడా పేదరిక నిర్మూలన కోసం నినాదాలు ఇచ్చారు. మీ జీవితాల్లో మాత్రమే పేదరికం లేదు. ప్రజల పేదరికం ఇంకెప్పుడు నిర్మూలించబడుతుంది? వారి పేదరికాన్ని మేము నిర్మూలిస్తాం’ అని వ్యాఖ్యానించారు.
కొన్ని బీమా సంస్థలు రైతులను మోసగిస్తున్నాయని, ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ప్రధాని మోదీని ఉద్ధవ్ ఠాక్రే ఈ సందర్భంగా కోరారు. ప్రతి జిల్లాలోనూ బీమా సంస్థలు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌తో భారత్ అనుసరించాల్సిన విధానం చాలా కఠినంగా ఉండాలని ఆయన మోదీని కోరారు.
‘పాక్‌కు బుద్ధి చెప్పడం అనే విషయంపై మాత్రమే మన ప్రభుత్వం దృష్టి పెట్టకూడదు. ప్రధాన మంత్రి జీ... మరోసారి భారత్ జోలికి పాక్ రాకుండా ఉండేలా... ఆ దేశంపై కఠిన చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము’ అని భరోసా వ్యక్తం చేశారు.